జనసేనలో చేరిన అవనిగడ్డ, పాలకొండ అభ్యర్ధులు.. !
ఏపీలో ఎన్నికల వేళ రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. ముఖ్యంగా ఓ పార్టీలో టికెట్లు లభించని వారు ప్రత్యర్ధి పార్టీల్లోకి ఫిరాయించడం చూస్తూనే ఉంటాం. కానీ ఇప్పుడు మిత్రపక్షాల్లోకి సైతం ఫిరాయించేస్తున్నారు. ఇదే క్రమంలో టీడీపీలో టికెట్లు ఆశించి అవి దక్కకపోవడంతో కొన్నాళ్లుగా అసంతృప్తిగా ఉన్న ఇద్దరు నేతలు ఇవాళ జనసేన పార్టీలో చేరిపోయారు. వీరిలో అవనిగడ్డ మాజీ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తో పాటు పాలకొండ టీడీపీ నేత నిమ్మక జయకృష్ణ ఉన్నారు.
మాజీ టీడీపీ నేతలు మండలి బుద్దప్రసాద్, నిమ్మక జయకృష్ణ ఇవాళ పవన్ కళ్యాణ్ సమక్షంలో టీడీపీలో చేరారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పర్యటన సందర్భంగా అక్కడికి వచ్చిన వీరిద్దరూ జనసేన తీర్ధం పుచ్చుకున్నారు. వీరితో పాటు వీరి అనుచరులు, పలువురు ద్వితీయ శ్రేణి నాయకులు సైతం జనసేనలో చేరారు. వచ్చే ఎన్నికల్లో టికెట్ హామీతోనే వీరిద్దరూ జనసేనలో చేరినట్లు తెలుస్తోంది. త్వరలో వీరిద్దరి పేర్లను అవనిగడ్డ, పాలకొండ నియోజకవర్గాలకు ప్రకటించనున్నారు. దీంతో జనసేన జాబితా పూర్తవుతుంది.

టీడీపీలో గతంలో మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మండలి బుద్ధప్రసాద్ కు తాజాగా ఆ పార్టీ టికెట్ నిరాకరించింది. ఆ తర్వాత ఈ నియోజకవర్గాన్ని జనసేనకు కేటాయించేసింది. దీంతో ఆయన మరో పార్టీలోకి వెళ్లే అవకాశం కూడా లేకుండా పోయింది. దీంతో ఆయన వ్యూహాత్మకంగా జనసేనను ఆశ్రయించి అక్కడి నేతల్ని కాదని తనకు టికెట్ తెచ్చుకుంటున్నారు. అలాగే పాలకొండలోనూ స్ధానిక జనసేన నేతల్ని కాదని టీడీపీ నేత నిమ్మక జయకృష్ణను తెచ్చి పవన్ టికెట్ కేటాయిస్తున్నారు.












Click it and Unblock the Notifications