మీ సంగతి బాబు వద్దే తేల్చుకుంటా: ఎమ్మెల్యేలపై ఊగిపోయిన అయ్యన్న
మీ సంగతి పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వద్దే తేలుస్తానని మంత్రి, గుంటూరు జిల్లా ఇంచార్జి అయ్యన్న పాత్రుడు బుధవారం నాడు ఊగిపోయారు. బుధవారం సాయంత్రం గుంటూరులో ఈ సంఘటన జరిగింది.
గుంటూరు: మీ సంగతి పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వద్దే తేలుస్తానని మంత్రి, గుంటూరు జిల్లా ఇంచార్జి అయ్యన్న పాత్రుడు బుధవారం నాడు ఊగిపోయారు. బుధవారం సాయంత్రం గుంటూరులో ఈ సంఘటన జరిగింది.
అయ్యన్న అధ్యక్షతన గత వారం పార్టీ జిల్లా నాయకులు భేటీ అయ్యారు. మళ్లీ 28న (బుధవారం) సమావేశమవుదామని, అప్పటికి పార్టీ కమిటీలన్నిటిపై ఏకాభిప్రాయం తీసుకుని సిద్ధం చేయాలని సూచించారు.

అయ్యన్న భేటీకు వారు డుమ్మా.. చిర్రెత్తుకొచ్చింది
బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ అయ్యన్న ఉదయాన్నే గుంటూరు వచ్చారు. మాజీ మంత్రి రావెల కిశోర్ విజ్ఞప్తి మేరకు ప్రత్తిపాడు నియోజకవర్గంలో పర్యటించారు. అనంతరం సాయంత్రం నాలుగు గంటల సమయంలో నగరానికి వచ్చారు. ద్వితీయశ్రేణి నాయకులు మినహా మంత్రులు, ఎంపీలు ఎమ్మెల్యేలెవరూ హాజరు కాలేదు. దీంతో ఆయనకు చిర్రెత్తుకొచ్చింది.

ఒక్కరు కూడా రారా..
దీంతో పార్టీ గుంటూరు జిల్లా నాయకులపై చింతకాయల అయ్యన్నపాత్రుడు మండిపడ్డారు. తాను సమావేశం ఏర్పాటు చేస్తే ఒక్క ఎమ్మెల్యే కూడా రానందుకు ఆగ్రహంతో ఊగిపోయారు. మీ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు వద్దే తేలుస్తానని హెచ్చరించారు.

గంటన్నర వేచి చూసినా..
అయ్యన్న గంటన్నర వేచిచూసినా ఒక్కరూ రాలేదు. దాంతో అయ్యన్నకు కోపం వచ్చింది. ఇంచార్జీ మంత్రి అంటే లెక్క లేదా? గుంటూరు ఎంపీ, ఎమ్మెల్యేలూ రాలేదని, అలాంటప్పుడు తనకు అసలు ఈ జిల్లా బాధ్యతలే అవసరం లేదని చెప్పారు.

అక్కడికి అక్కడే ఫిర్యాదు
అక్కడి నుంచే టిడిపి జాతీయ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ వీవీవీ చౌదరికి అయ్యన్న ఫోన్‌లో ఫిర్యాదు చేశారు. జిల్లా ఇంచార్జిగా తననే కొనసాగమంటే మాత్రం నాయకులతో సంబంధం లేకుండా కేడర్‌తో సంప్రదించి కమిటీలు ప్రకటిస్తానని తెలిపారు.

నేతల వివరణ
గురువారం ఉదయం సీఎంను కలిసి నివేదిస్తానని చెప్పి అయ్యన్న వెళ్లిపోయారు. దీనిపై జిల్లా నేతలు మాట్లాడుతూ.. సమాచార లోపం వల్లే ఎమ్మెల్యేలు, ఎంపీలు రాలేదని తెలిపారు. అలాగే, ఇతర కార్యక్రమాల వల్ల హాజరు కాలేకపోయారన్నారు.












Click it and Unblock the Notifications