అమరావతిపై కేంద్రం ముందస్తు తీర్పు ? సుప్రీం, పార్లమెంట్ లో యూటర్న్ ! అసలు కారణమిదే ?
అమరావతి స్ధానంలో ఇతర రాజధానులు ఏర్పాటు చేసుకోవడం రాష్ట్ర ప్రభుత్వ ఇష్టమంటూ గతంలో పార్లమెంటు, హైకోర్టులో చెప్పిన కేంద్రం.. ఇప్పుడు రూటు మార్చి అమరావతికే మద్దతివ్వడం సంచలనం రేపుతోంది.
ఏపీలో వైసీపీ ప్రభుత్వం అమరావతి స్ధానంలో మూడు రాజధానుల్ని తెరపైకి తీసుకురాగానే దీనిపై స్పందిస్తూ రాజధానుల ఏర్పాటు రాష్ట్ర ప్రభుత్వ ఇష్టమని చెప్పిన కేంద్రం.. ఇప్పుడు రూటు మార్చింది. విభజన చట్టం ప్రకారం చూస్తే అమరావతే రాజధాని అంటూ అటు పార్లమెంటుతో పాటు ఇటు సుప్రీంకోర్టులోనూ 24 గంటల వ్యవధిలో క్లారిటీ ఇచ్చేసింది. దీంతో వైసీపీ సర్కార్ పూర్తిగా ఇరుకునపడింది. ఇప్పుడు కేంద్రం మద్దతు లేకుండానే మూడు రాజధానులపై సుప్రీంకోర్టులో ఒంటరి పోరుకు సిద్ధమవుతోంది.

అమరావతికే కేంద్రం ఓటు
గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏపీ రాజధానిగా ఎంపికై, ప్రధాని మోడీ చేతుల మీదుగా శంఖుస్దాపన కూడా చేసుకున్న అమరావతి రాజధానిలో చంద్రబాబు వర్గం అక్రమాలకు పాల్పడినందున, రాజధానిగా ఒకే ప్రాంతం ఉంటే అభివృద్ధి కేంద్రీకృతం అవుతున్నందున మూడు రాజధానుల్ని వైసీపీ సర్కార్ తెరపైకి తెచ్చింది. అయితే ఈ వాదన చెప్పుకోవడానికి బాగానే ఉన్నా దీనిపై కేంద్రం, న్యాయవ్యవస్ధ మద్దతు లేకపోతే ఎంత కష్టమో వైసీపీ సర్కార్ కు ఇప్పుడిప్పుడే తెలిసొస్తోంది. తాజాగా 24 గంటల వ్యవధిలో కేంద్రం తీసుకున్న రెండు నిర్ణయాలతో అమరావతి రాజధానికే మా ఓటు అని తేల్చిచెప్పేసినట్లయింది.

పార్లమెంటులో, సుప్రీంకోర్టులోనూ..
తొలుత పార్లమెంటులో అమరావతికి మద్దతుగా రాతపూర్వక ప్రకటన చేయించిన కేంద్రం.. అత్యంత వ్యూహాత్మకంగా 24 గంటల్లోపే సుప్రీంకోర్టులోనూ ఆ మేరకు అఫిడవిట్ దాఖలు చేయించేసింది. రాజ్యసభలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్ అమరావతి రాజధాని ఎంపిక విభజన చట్టం ప్రకారమే జరిగిందని క్లారిటీ ఇచ్చేశారు. అనంతరం సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన నోటీసులకు స్పందిస్తూ కేంద్రం ఈ వాదనకు మద్దతుగా అఫిడవిట్ కూడా దాఖలు చేసేసింది. ఈ రెండు చోట్లా కేంద్రం చెప్పింది ఒక్కటే. విభజన చట్టంలోని 5, 6 సెక్షన్ల ప్రకారం అమరావతి రాజధాని ఎంపిక సరైనదే. దీంతో ఇప్పుడు కేంద్రం ఏపీ రాజధానిపై ఫుల్ క్లారిటీ ఇచ్చేసినట్లయింది.

మూడు రాజధానులకు ముందస్తు చెక్ ?
పార్లమెంటులో గతంలో రాజధానుల ఎంపిక రాష్ట్ర ప్రభుత్వ ఇష్టమని చెబుతూ వచ్చిన కేంద్రం..ఇప్పుడు అమరావతి రాజధాని ఎంపిక విభజన చట్టం ప్రకారమే జరిగిందని చెప్పేయడంతో ఈ వ్యవహారానికి ముగింపు పలికినట్లయింది. అదే సమయంలో సుప్రీంకోర్టులోనూ ఇదే అంశాన్ని అఫిడవిట్ రూపంలో సమర్పించడంతో కేంద్రం ఇక మూడు రాజధానుల స్ధానంలో అమరావతికే సంపూర్ణ మద్దతు ప్రకటించినట్లయింది. ఇప్పుడు ఏపీలో వైసీపీ ప్రభుత్వంతో ఉన్న సాన్నిహిత్యం మేరకు మరో యూటర్న్ తీసుకుంటే తప్ప అమరావతి విషయంలో బీజేపీ, కేంద్రం స్టాండ్ మారేలా లేదు. అంతే కాదు అమరావతి రాజధానికి మద్దతుగా హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు తుది తీర్పు ఇవ్వకముందే కేంద్రం మూడు రాజధానులకు చెక్ పెట్టినట్లయింది.

కేంద్రం దూకుడు వెనుక ?
కేంద్రం ఇంత హడావిడిగా అమరావతి రాజధానికి మద్దతుగా పార్లమెంట్, సుప్రీంకోర్టులో తమ అభిప్రాయాలు వెల్లడించడం వెనుక బీజేపీ నుంచి ఎదురవుతున్న ఒత్తిడే కారణంగా తెలుస్తోంది. ముఖ్యంగా ఏపీలో మారుతున్న రాజకీయ పరిస్ధితుల్లో వైసీపీ మూడు రాజధానులకు మద్దతిచ్చినా భారీగా నిధులు కూడా ఇవ్వక తప్పదు. అలాగే ఏపీలో వైసీపీ మినహా మిగిలిన పార్టీలన్నీ అమరావతి రాజధానికే మద్దతిస్తున్నాయి. చివరికి బీజేపీతో విబేధిస్తున్న తెలంగాణ పార్టీ బీఆర్ఎస్ కూడా తాజాగా అమరావతికే మద్దతిచ్చింది. దీంతో అమరావతికి మద్దతుగా క్లారిటీతో నిర్ణయం తీసుకుంటే వచ్చే ఎన్నికల్లో ప్రయోజనం ఉంటుందని కేంద్రం భావించినట్లు తెలుస్తోంది. టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తు ఉంటే అవకాశాలున్న నేపథ్యంలో ఈ నిర్ణయానికి ఇప్పటికే మద్దతిస్తున్న ఈ పార్టీలకు రాజకీయంగా మేలు చేసే అవకాశాలూ లేకపోలేదు.












Click it and Unblock the Notifications