బాలకృష్ణ దూరం: మంత్రిగా పరిటాల సునీతకు చాన్స్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో చేరకూడదని హిందూపురం శాసనసభ్యుడు, సినీ హీరో బాలకృష్ణ నిర్ణయించుకున్నట్లు సమాచారం. దీంతో అనంతపురం జిల్లా నుంచి పరిటాల సునీతకు మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం ఉంది. సినిమాల్లో మరి కొంతకాలం కొనసాగే ఉద్దేశంతోనే ఆయన మంత్రి పదవికి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకొన్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే ఆయన చంద్రబాబుకు కూడా తెలిపినట్లు తెలిసింది.
బుధవారం తిరుపతిలో జరిగిన పార్టీ శాసనసభాపక్ష సమావేశంలో పాల్గొన్న బాలకృష్ణ గురువారం సాయంత్రం హైదరబాద్‌లో చంద్రబాబును ఆయన నివాసంలో కలుసుకున్నారు. బాలకృష్ణ హిందూపురం నుంచి గెలవడం, ఎన్టీఆర్ కుమారుడు కూడా కావడంతో ఆయనకు మంత్రి పదవి ఖాయమని పార్టీ వర్గాలు భావిస్తూ వచ్చాయి. కానీ బాలకృష్ణ ఆలోచనలు మరో విధంగా ఉన్నట్లు చెబుతున్నారు.

ఎన్నికలకు ముందు ఆయన హీరోగా నటించిన లెజెండ్ సినిమా ఘన విజయం సాధించింది. ఆ తర్వాత ఆయనతో సినిమాలు తీయడానికి అనేక మంది నిర్మాతలు ముందుకు వచ్చారు. మంత్రివర్గంలో చేరితే సినిమాల్లో నటించడానికి వీలు కాదు. దీంతో, తన నట జీవితాన్ని మరి కొంతకాలం కొనసాగించాలని ఆయన నిర్ణయించుకొన్నారు. ఎస్ఎల్‌వీ సినిమా అనే సంస్థ నిర్మిస్తున్న ఒక సినిమా షూటింగ్‌ను ఈ నెల ఒకటో తేదీన ఆయన ప్రారంభించారు.
రామానాయుడు స్టూడియోలో షూటింగ్ జరుగుతున్న ఈ సినిమాలో బాలకృష్ణ హీరోగా నటిస్తున్నారు. మరో రెండు సినిమాలు కూడా ఆయన అంగీకరించారని, వాటి షూటింగ్ ఆ తర్వాత ఉంటుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. కాగా, మంత్రి పదవి తీసుకోవడానికి బాలకృష్ణకు రాజ్యాంగపరమైన నిబంధనలు కూడా అడ్డుగా నిలుస్తున్నాయి. మంత్రి పదవుల్లో ఉన్నవారు లాభదాయకమైన ఇతర వృత్తి, వ్యాపారాలు నిర్వహించకూడదు. మంత్రిగా ఉంటూ ఆయన సినిమా షూటింగ్‌ల్లో పాల్గొంటే ఈ నిబంధనను అతిక్రమించినట్లు అవుతుంది.
తన సినిమా కెరీర్ బాగున్నంత వరకూ ఆ రంగంలోనే కొనసాగాలని, ఆ తర్వాతే మంత్రి పదవి గురించి ఆలోచించాలని బాలకృష్ణ నిర్ణయించుకొన్నట్లు చెబుతున్నారు. గతంలో ముఖ్యమంత్రిగా ఉంటూ ఎన్టీఆర్ బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమాలో నటించారు. ఆ సినిమా పెద్దగా ఆడకపోగా ఎన్టీఆర్ విమర్శలకు గురయ్యారు. ఆ తర్వాత సినీ నటులు డాక్టర్ ఎన్.శివప్రసాద్, బాబూ మోహన్ బాబు కేబినెట్లో మంత్రులుగా చేశారు. అప్పుడు వారిద్దరూ సినీ రంగానికి దూరంగా ఉన్నారు.












Click it and Unblock the Notifications