సుబ్బారెడ్డిని జైల్లో వేస్తే సంతోషించే మొదటి వ్యక్తిని నేనే..!!
ఏపీ రాజకీయాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. కూటమి వర్సస్ వైసీపీ రాజకీయంలో కొత్త సమీకరణాలు తెర మీదకు వస్తున్నాయి. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత వైసీపీలోని జగన్ సన్నిహిత నేతలు కొందరు కూటమి పార్టీల్లో చేరారు. మాజీ మంత్రి బాలినేని ఆ జాబితాలో ఉన్నారు. ఆయన జనసేనలో కొనసాగుతున్నారు. వైసీపీలో ఉన్న సమయం నుంచి వైవీ సుబ్బారెడ్డి తో ఆయనకు విభేదాలు ఉన్నాయి. కాగా.. ఇప్పుడు వైవీ సుబ్బారెడ్డి పైన కేసుల విషయంలో చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
వైసీపీ ముఖ్య నేత వైవీ సుబ్బారెడ్డి లక్ష్యంగా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసారు. వైసీపీలో బాలినేని మంత్రిగా కొనసాగిన సమయంలో వైవీ సుబ్బారెడ్డి టీటీడీ ఛైర్మన్ గా వ్యవహరించారు. బాలినేని మంత్రి పదవి నుంచి తప్పించిన తరువాత పలు మార్లు పార్టీ నిర్ణయాల పైన ఆయన అలక బూనారు. పార్టీ నిర్ణయాల విషయంలో వైవీ సుబ్బారెడ్డి పైన పరోక్షం గా ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇక, 2029 ఎన్నికల్లో వైసీపీ ఓటమి తరువాత బాలినేని జనసేనలో చేరారు. ఇప్పటి వరకు ఆయనకు అక్కడ ఎలాంటి పదవి దక్కలేదు. ఈ సమయంలోనే మరోసారి వైవీ సుబ్బారెడ్డి పైన కీలక వ్యాఖ్యలు చేసారు. తిరుమల లడ్డూలో వైవీ సుబ్బారెడ్డి ఎంత సంపా దించుకున్నారో తనకు తెలియదని.. మిగతా విషయాల్లో చాలా సంపాదించుకున్నారని తెలిపారు. సుబ్బారెడ్డిని జైల్లో వేస్తే సంతోషించే మొదటి వ్యక్తి తానే అంటూ బాలినేని వ్యాఖ్యానించారు. తాను ఒంగోలు నుంచి ఏడు సార్లు పోటీ చేసి రెండు సార్లు ఓడిపోయానని గుర్తు చేసారు.

వైసీపీలో ఉన్న నాటి నుంచి ఇద్దరి మధ్య విభేదాలు
ఆ ఓడిన రెండు సందర్భాల్లోనూ కూటమి బలంగా ఉండటమే కారణమని బాలినేని చెప్పుకొచ్చారు. ఇక, తాను ఎన్నికల తర్వాత తాను జనసేనలో చేరానని తెలిపారు. కూటమి పార్టీలో ఉన్న తనపై పలు ఆరోపణలు చేశారని ఆయన అన్నారు. తనపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరపాలని సీఎం చంద్రబాబును కోరానని శ్రీనివాసరెడ్డి తెలిపారు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో డ్వాక్రా గ్రూపుల్లో నగదు కాజేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. వైసీపీలో డ్వాక్రా మహిళల నగదు కాజేసిన వారి పేర్లు బయటపెట్టాలని శ్రీనివాసరెడ్డి కోరారు. తన కొడుకుపై అసత్య ఆరోపణలు చేసి తనను మానసిక క్షోభకు గురి చేస్తున్నారని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. కాగా.. ఇప్పుడు బాలినేని చేసిన వ్యాఖ్యల పైన రాజకీయంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.












Click it and Unblock the Notifications