బాబుపై అసంతృప్తి: పార్టీ పదవికి బండారు రాజీనామా
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి మంత్రివర్గ కూర్పుపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. మంత్రి పదవి దక్కనందుకు నిరసనంగా విశాఖపట్నం జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుడు బండారు సత్యనారాయణ మూర్తి అసంతృప్తి వ్యక్తం చేశారు. గత పదేళ్లుగా తాను పార్టీకి చేసిన సేవలను పట్టించుకోలేదని ఆయన విమర్సించారు.
తాను పార్టీ ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన తెలిాపరు. అయితే, తాను మంత్రిపదవి రాకపోయినా పార్టీలో కొనసాగుతానని చెప్పారు. విశాఖపట్నం జిల్లా పెందుర్తి శాసనసభా నియోజకవర్గం నుంచి ఆయన విజయం సాధించారు.

బండారు సత్యనారాయణ మూర్తి అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బండారు స్వగ్రామం వెన్నెలపాలెంలో ఆయన అనుచరులు సమావేశమయ్యారు. బండారుకు మంత్రి పదవి ఇవ్వనందుకు నిరసనగా పలువురు సర్పంచులు, ఎంపిటీసిలు రాజీనామాకు సిద్ధపడ్డారు.
ఇదిలావుంటే, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, కృష్ణా జిల్లా పెడన ఎమ్మెల్యే కాగిత వెంకట్రావ్ సోమవారం అస్వస్థతకు గురయ్యారు. ఆదివారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించిన మంత్రివర్గంలో అతనికి చోటు దక్కకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఈ నేపథ్యంలో ఆయనకు గుండెపోటు వచ్చింది. వెంటనే ఆయనను కుటుంబ సభ్యులు మచిలీపట్నంలోని ఆస్పత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications