పురంధేశ్వరి ఆఫీస్‌పై గుడ్ల దాడి: మంత్రుల ఇళ్ల ముట్టడి

విభజనపై కేంద్ర కేబినేట్ నిర్ణయానికి వ్యతిరేకంగా విశాఖ జిల్లాలో సమైక్య ఆందోళనలు కొనసాగుతున్నాయి. శనివారం ఉదయం కేంద్ర మంత్రి పురంధేశ్వరి క్యాంపు కార్యాయంపై సమైక్యాంధ్ర నినాదాలు చేస్తూ విద్యార్థులు కోడిగుడ్లతో దాడి చేశారు. అక్కడికి చేరుకున్న పోలీసులు విద్యార్థులను అరెస్ట్ చేశారు. అయితే వీరంతా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగానికి చెందిన వారుగా అనుమానిస్తున్నారు.
శ్రీకాకుళంలో కేంద్రమంత్రి కిల్లి కృపారాణి ఇంటిని ముట్టడించేందుకు సమైక్యవాదులు, తెలుగుదేశం పార్టీ శ్రేణులు యత్నించారు. ఈ సందర్భంగా సమైక్యవాదులను పోలీసులు అడ్డుకోవడంతో కొంత ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. సమైక్య వాదులు, పోలీసులకు మధ్య తోపులాట చోచుచేసుకుంది. దీంతో పోలీసులు సమైక్యవాదులతోపాటు టిడిపి నేత రామ్మోహన్ నాయుడును పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం సొంత పూచీకత్తుపై విడిచిపెట్టారు.
తూర్పు గోదావరి జిల్లాలో రాజమండ్రిలోని మోరంపూడి జంక్షన్ వద్ద జాతీయ రహదారిపై తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా టిడిపి నాయకుడు మురళీ మోహన్ సహ పలువురు నాయాకులను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో మురళీమోహన్‌ను విడుదల చేయాలని పలువురు కార్యకర్తలు పోలీస్‌స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. తెలుగునాడు విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లా తిరుపతిలో పార్లమెంటు సభ్యుడు చింతా మోహన్ ఇంటి ముట్టడికి యత్నించారు. అడ్డుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.
కృష్ణా జిల్లాలో కూడా సమైక్యవాదులు నిరసన చేపట్టారు. విజయవాడలో బస్టాండ్ వద్ద టిడిపి నేతలు దేవినేని ఉమ, గద్దె రామ్మోహన్, నాగుల్ మీరా, బుద్దా వెంకన్నలతోపాటు పలువురు సమైక్యవాదులు రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. 9వ నంబర్ జాతీయ రహదారిపై పలువురు సమైక్యవాదులు బైఠాయించారు. దీంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. అనంతపురంలో టిడిపి శ్రేణులు జై సమైక్యాంధ్ర నినాదాలు చేస్తూ బైక్ ర్యాలీ నిర్వహించాయి. ప్రకాశం జిల్లాలోని చీరాలలో టిడిపి కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. గుంటూరు, కడప, నెల్లూరు, పశ్చిమ గోదావరి జిల్లాలతోపాటు సీమాంధ్ర జిల్లాలో సమైక్యవాదులు నిరసన ప్రదర్శనలు చేపట్టారు.












Click it and Unblock the Notifications