అమిత్ షాతో చంద్రబాబు భేటీ, పొత్తుపై తేల్చేసిన బండి సంజయ్..!!
టీడీపీ అధినేత చంద్రబాబు..కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో భేటీ తెలుగు రాజకీయాల్లో సంచలనంగా మారింది. టీడీపీ..బీజేపీ పొత్తు పైన చర్చలు మొదలయ్యాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో త్వరలో జరగనున్న ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి ముందుకెళ్లే విధంగా చర్చలు జరిగాయంటూ ప్రచారం సాగుతోంది. ఈ ప్రచారం పైన తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. ఈ భేటీ.. పొత్తుల పైన కీలక వ్యాఖ్యలు చేసారు. తమ విధానం తేల్చి చెప్పారు.
బండి సంజయ్ క్లారిటీ:కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలను ఏపీ మాజీ సీఎం చంద్రబాబు కలిస్తే తప్పేముందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రశ్నించారు. టీడీపీతో బీజేపీ పొత్తుకు సిద్ధమైందని వచ్చిన వార్తలు ఊహాగానాలేనని కొట్టిపారేశారు. దేశ, రాష్ట్రాల అభివృద్ధి కోసం గతంలో మమతా బెనర్జీ, స్టాలిన్, నితీశ్ కుమార్ వంటి ప్రతిపక్ష నేతలను ప్రధాని మోదీ, అమిత్ షా కలిశారని గుర్తు చేశారు. తెలంగాణలో బీజేపీ గ్రాఫ్ పెరుగుతోందని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్‌ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం, కమ్యూనిస్టు పార్టీలంతా కలిసే పోటీ చేయబోతున్నాయని వెల్లడించారు. ప్రజలు బీఆర్‌ఎస్ పాలన పట్ల విసిగిపోయారని, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించడం ఖాయమని ధీమా వ్యక్తం చేసారు.

టీడీపీ- బీజేపీ చర్చలతో:2019 ఎన్నికల సమయంలో ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన తరువాత టీడీపీ- బీజేపీ మధ్య సంబంధాలు తెగి పోయాయి. ఇప్పుడు ఏపీలో ఎన్నికల పొత్తుల్లో భాగంగా జనసేనాని పవన్ కల్యాణ్ టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేయాలని ప్రతిపాదన చేసారు. ఈ మేరకు నేరుగా బీజేపీ అధ్యక్షుడు నడ్డా తో మంతనాలు చేసారు. ఇప్పుడు దీనికి కొనసాగింపుగా ఢిల్లీలో అమిత్ షా తో చంద్రబాబు సమావేశంలో నడ్డా కూడా పాల్గొనటంతో పొత్తులపైనే చర్చలు చేసినట్లు తెలుస్తోంది. తెలంగాణలో టీడీపీతో పొత్తుకు అవకాశం లేదని ఇప్పటికే పలు మార్లు రాష్ట్ర బీజేపీ నేతలు చెబుతూ వచ్చారు. ఇప్పుడు చంద్రబాబు - అమిత్ షా ముఖా ముఖి సమావేశంతో మరోసారి చర్చల ప్రతిపాదనలు తెర మీదకు వచ్చాయి.
తేలని పొత్తు పంచాయితీ:బీజేపీ నాయకత్వానికి తెలంగాణ ఎన్నికలు ప్రతిష్ఠాత్మకం కావటంతో అక్కడ టీడీపీతో పొత్తు దిశగా అడుగులు పడుతున్నాయంటూ ప్రచారం సాగుతోంది. అయితే ,ఏపీ విషయంలోనూ స్పష్టత వచ్చిన తరువాత నే ఈ పొత్తు ప్రతిపాదనల పైన భవిష్యత్ నిర్ణయాలు ఉంటాయని టీడీపీ నేతలు చెబుతున్నారు. పొత్తు రెండు పార్టీలకు మేలు చేసేదిగా ఉండాలని విశ్లేషిస్తున్నారు. ఇది ప్రాధమిక స్థాయిలో జరిగిన చర్చలుగానే చెబుతున్నారు. ఈ చర్చలకు సంబంధించి రెండు పార్టీల నుంచి అధికారికంగా ఎవరూ స్పందించలేదు. ఏపీలో సీఎం జగన్ కు బీజేపీ అగ్రనాయకత్వం అనుకూలంగా ఉందనే ప్రచారం జరుగుతున్న సమయం లో టీడీపీతో పొత్తు ఏపీలో కొత్త రాజకీయ సమీకరణాలకు దారి తీస్తోంది. 8న అమిత్ షా, 10న నడ్డా ఏపీ పర్యటనలో పొత్తులపైన స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications