Bahamas Plane Crash: కుప్పకూలిన విమానం.. 10 మంది మృతి
బహమాస్ లో విషాదమైన ఘటన జరిగింది. విమానం కుప్పకూలి 10 మంది మృతి చెందారు. బహమాస్ లోని అతిపెద్ద ద్వీపంపై విమానం కుప్పకూలడంతో ఈ దారుణం జరిగింది. అధికారుల సమాచారం ప్రకారం శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల సమయంలో బహమాస్ రాజధాని నస్సౌ లోని లిండెన్ పిండ్లింగ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు నుంచి విమానం టేకాఫ్ అయింది. ఆ సమయంలో విమానంలో 9 మంది ప్రయాణికులు, ఓ పైలట్ ఉన్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఆండ్రూస్ ఐలాండ్ లోని నికోలాస్ టౌన్ పోలీసులకు ఓ విమానం కుప్పకూలినట్లు సమాచారం వచ్చింది. ఈ ఘటన సాన్ ఆండ్రూస్ ఎయిర్ పోర్ట్ కు వెస్ట్ ప్రాంతంలో జరిగిందని సమాచారం వచ్చిందని ది రాయల్ బహమాస్ పోలీస్ కమిషనర్ శాంతా ఎమిలీ నౌలెస్ పేర్కొన్నారు.
ఘటన గురించి తెలిసిన వెంటనే సంబంధిత అధికారులు ఘటనాస్థలికి చేరుకున్నాయి. ఆ సమయంలో విమానంలోని ఒక్క వ్యక్తి మాత్రమే ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. మిగతావారంతా మృతి చెందారు. అయితే కొద్ది నిమిషాల్లోనే ఆ వ్యక్తి కూడా మృతి చెందాడని అధికారులు తెలిపారు. దాంతో విమానంలోని మొత్తం 10 మంది ప్రాణాలు కోల్పోయారని పేర్కొన్నారు. ప్రస్తుతానికి అయితే మృతులను ఇంకా గుర్తించలేదని తెలిపారు. బహమాస్ లోని ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ అథారిటీ అందించిన ప్రాథమిక రిపోర్టు ప్రకారం ఆ విమానం సాన్ ఆండ్రూస్ ఎయిర్ పోర్ట్ కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పేర్కొంది.
ఫ్లైట్ రికార్డులు, అధికారులు అందించిన సమాచారం ప్రకారం.. సెస్నా 402 అనే విమానాన్ని ఫ్లామింగో ఎయిర్ సంస్థ ఆపరేట్ చేస్తోంది. ఈ విమానం నాస్సౌ నుంచి సాన్ ఆండ్రూస్ ఎయిర్ పోర్ట్ మధ్య నడుస్తుంది. ది ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ అథారిటీ తెలిపిన వివరాల ప్రకారం ల్యాండింగ్ సమయంలో తలెత్తిన ఇబ్బందుల కారణంగా పక్కనే ఉన్న పొదల్లో విమానం కూలింది.

దాంతో ఈ దారుణమైన ఘటన జరిగింది. ఇక ఫ్లామింగ్ ఎయిర్ సంస్థ బహమాస్, కరీబియన్ ప్రాంతాల్లో తన కార్యకలాపాలను కొనసాగిస్తోంది. ఈ ఘటన తర్వాత బహమాస్ కు చెందిన మినిస్ట్రీ ఆఫ్ ఎనర్జీ కీలక నిర్ణయం తీసుకుంది. ఫ్లామింగో సంస్థకు చెందిన అన్ని విమాన సర్వీసులను నిలిపివేసింది. ప్రజల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది. అయితే ఈ నిర్ణయంపై ఫ్లామింగో ఎయిర్ సంస్థ ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇక ఈ ఘటనపై బహమాస్ పోలీసులు, ఏవియేషన్ అధికారులు పూర్తిస్థాయిలో దర్యాప్తు నిర్వహిస్తున్నారు.












Click it and Unblock the Notifications