అనంత పోలీసుల అదుపులో ఏటిఎం దాడి నిందితుడు?
అనంతపురం: కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు ఏటిఎంలో నవంబర్ 19న మహిళపై దాడికి పాల్పడిన కేసుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం పోలీసులు శుక్రవారం ఓ అనుమాతుడ్ని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అనంతపురం పట్టణంలోని రాంనగర్ ప్రాంతంలోని ఏటిఎం సెక్యూరిటీ గార్డు సహాయంతో అనుమానితుడ్ని పోలీసులు పట్టుకున్నట్లు తెలిసింది.
బెంగళూరు ఏటిఎం దాడికి పాల్పడిన వ్యక్తిని పోలిన వ్యక్తి ఇక్కడి ఏటిఎంలో డబ్బులు డ్రా చేసుకున్నాడని పోలీసులకు సెక్యూరిటీ గార్డు సమాచారం ఇచ్చాడు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు అనుమానితుడ్ని అదుపులోకి తీసుకుని రహస్య ప్రదేశంలో విచారిస్తున్నట్లు తెలిసింది. కాగా అనుమానితుడు కర్నూలుకు చెందిన వాడని, తెలుగు, కన్నడ బాషలను బాగా మాట్లాడుతున్నానడని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.

ఈ విషయమై అనంతపురం జిల్లా పోలీసులను సంప్రదించగా.. బెంగళూరు ఏటిఎం దాడికి సంబంధించిన కేసులో ఏ వ్యక్తిని అదుపులోకి తీసుకోలేదని సమాధానం ఇచ్చారు. బెంగళూరు ఏటిఎం దాడికి పాల్పడిన నిందితుడికి సంబంధించిన ఓ చిత్రాన్ని విడుదల చేసినట్లు పోలీసులు తెలిపారు. అన్ని ఏటిఎం కేంద్రాల సెక్యూరిటీ గార్డులను అప్రమత్తం చేశామని, అనుమానిత వ్యక్తులు తారస పడితే తమకు సమాచారం ఇవ్వాలని కోరామని పోలీసులు చెప్పారు.
కాగా ఇప్పటికే అనంతపురం జిల్లాలో బెంగళూరుకు చెందిన ప్రత్యేక పోలీసు బృందం కూడా నిందితుని కోసం గాలింపు చర్యలు చేపట్టింది. నిందితుడు బాధితురాలి నుంచి తీసుకొచ్చిన మొబైల్ ఫోన్‌ను హిందూపురంలోని ఓ దుకాణాదారునికి అమ్మినట్లు పోలీసులు తమ విచారణలో తేల్చారు. బెంగళూరు ఏటిఎం దాడి నిందితుడే అనంతపురంలోని ధర్మవరంలో నవంబర్ 10న ఓ మహిళ హత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
కాగా అనంతపురం జిల్లాలోని కదిరిలోని ఓ ఏటిఎం కేంద్రంలో నిందితుడు బాధితురాలి వద్ద దొంగిలించిన ఏటిఎం కార్డు ద్వారా డబ్బులు డ్రా చేసినట్లు సిసి కెమెరా ఫుటేజి ద్వారా తెలుస్తోంది. నిందితుడిని పట్టించిన వారికి పోలీసులు రూ. 2 లక్షల రివార్డును ప్రకటించిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications