టీటీడీలో తొలిసారిగా అలా జరిగింది..
Tirumala: ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. ఆదివారం నాడు 75,706 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 23,340 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 3.34 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.
వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో ఆరు కంపార్ట్‌మెంట్లు నిండిపోయాయి. టోకెన్ లేని సర్వదర్శనం భక్తులకు స్వామివారి దర్శనానికి 8 నుంచి 10 గంటల సమయం పట్టింది. కంపార్ట్‌మెంట్లు, క్యూ లైన్లల్లో ఉన్న వారికి టీటీడీ సిబ్బంది, శ్రీవారి సేవకులు అల్పాహారం, పాలు, మంచినీరు పంపిణీ చేశారు.

నేడు వసంత పంచమిని పురస్కరించుకుని టీటీడీ అర్చకులు శ్రీవారి ఆలయంలో తొలిసారిగా వార్షిక విశేషపూజను వైభవంగా నిర్వహించారు. గతంలో శ్రీవారి ఆలయంలో ప్రతి సోమవారం వారపు సేవగా విశేషపూజను నిర్వహించేవారు.
శ్రీవారి ఉత్సవమూర్తుల అరుగుదలను అరికట్టి భవిష్యత్తు తరాలకు అందించడానికి వీలుగా ఏడాదికోసారి మాత్రమే అభిషేకం నిర్వహించాలనే జీయంగార్లు, అర్చకులు, ఆగమ పండితుల సూచన మేరకు వసంతోత్సవం, సహస్ర కలశాభిశేకం, విషేశపూజను చేపట్టాలని ఇదివరకు టీటీడీ బోర్డు నిర్ణయించిన విషయం తెలిసిందే.
ఇందులో భాగంగా వసంత పంచమి కూడా సోమవారమే రావడం వల్ల టీటీడీ అర్చకులు శ్రీవారి ఆలయంలో తొలిసారిగా వార్షిక విశేషపూజను వైభవంగా నిర్వహించారు. ఇకపై ప్రతి ఏడాది వసంత పంచమి పర్వదినాన వార్షిక విశేషపూజను ఏకాంతంగా నిర్వహించనుంది టీటీడీ.
తొలి పూజను శ్రీవారి ఆలయంలోని కళ్యాణ మండపంలో నేడు వైభవంగా నిర్వహించారు. ముందుగా అర్చకులు శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామిని వేంచేపు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. చతుర్దశ కలశావహనం గావించి పుణ్యహవచనం, వివిధ క్రతువులను నిర్వహించారు. అనంతరం పూర్ణాహుతితో ఈ కార్యక్రమం ముగిసింది.












Click it and Unblock the Notifications