బియాస్ దుర్ఘటన: హైదరాబాద్‌కు 5గురి మృతదేహాలు
హైదరాబాద్: హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రంలో బియాస్ నది వద్ద ప్రమాదం నుంచి బయటపడిన 24 మంది విద్యార్థులు సోమవారం రాత్రి క్షేమంగా హైదరాబాద్ చేరుకున్నారు. ఎయిర్ కోస్టా విమానంలో వారు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు.
బియాస్ నదిలో జరిగిన ప్రమాదంలో గల్లంతైన 24మందిలో మృతి చెందిన ఐదుగురు విద్యార్థుల మృతదేహాలు బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నాయి. రాంబాబు, విజేత, ఐశ్వర్య, లక్ష్మీ గాయత్రిల మృతదేహాలను రక్షణ శాఖ విమానంలో హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. విద్యార్థుల మృతదేహాలను వారి స్వస్థలాలకు తరలించేందుకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు.

మంగళవారం తెల్లవారుజామున 2.30కి విజేత మృతదేహాన్ని నిమ్స్ మార్చురీకి తరలించారు. ఉదయం 8గంటలకు విజేత సోదరుడు రాము మధురానగర్‌లోని తన నివాసానికి ఆమె మృతదేహాన్ని తరలించారు.
మరో విద్యార్థి మృతదేహం లభ్యం
బియాస్ నదిలో మరో విద్యార్థి మృతదేహాన్ని వెలికితీశారు. మృతదేహం దేవాశిష్ బోస్‌దిగా గుర్తించారు. సోమవారం ఐదుగురు విద్యార్థుల మృతదేహాలు లభ్యంకాగా మంగళవారం ఉదయం మరో విద్యార్థి మృతదేహాన్ని సహాయక సిబ్బంది గుర్తించారు. ఇంకా 19 మంది ఆచూకీ కోసం గాలిస్తున్నారు. మంగళవారం కూడా గాలింపు చర్యలు కొనసాగుతాయని కేంద్రమంత్రి అశోక్ గజపతి రాజు తెలిపారు. గల్లంతైన విద్యార్థుల కుటుంబాలతో ఆయన మాట్లాడారు. తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాయణ పర్యవేక్షిస్తున్నారు.












Click it and Unblock the Notifications