హోదాపై గేమ్: టిడిపిది వాస్తవమేనా, జగన్ వ్యూహం మార్చాలా?
విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక హోదా పైన నిత్యం ఏపీ సీఎం చంద్రబాబును మాత్రమే టార్గెట్ చేయడం చర్చనీయాంశమవుతోంది. ఏపీలోని సమస్యల విషయమై జగన్ ఆందోళనలు చేసినప్పుడు టిడిపిని టార్గెట్ చేశారు.
దానిపై సమస్య లేదంటున్నారు. కానీ ప్రత్యేక హోదా విషయంలో కూడా పదేపదే కేవలం ఆయన చంద్రబాబునే టార్గెట్ చేయడం ఏమిటని తెలుగుదేశం పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయమై చంద్రబాబును కూడా టార్గెట్ చేయడంలో తప్పులేదు కానీ, కేవలం చంద్రబాబునే టార్గెట్ చేయడం మాత్రం సరికాదని అంటున్నారు.
ఓటుకు నోటు, అమరావతి భూకుంభకోణం, ఇసుక కుంభకోణం, కాల్ మనీ సెక్స్ రాకెట్, ఎన్నికల హామీలు ఇలా పలు అంశాలపై జగన్ చంద్రబాబును నిత్యం ప్రశ్నిస్తున్నారు. అదే సమయంలో ప్రత్యేక హోదా పైన కూడా ప్రశ్నించవచ్చునని... కానీ మోడీని గట్టిగా నిలదీయకుండా బాబును ప్రశ్నించడం ఏమిటని అంటున్నారు.

టిడిపి చెబుతోంది నిజమా?
ప్రత్యేక హోదా సహా పలు అంశాలపై జగన్ ఎప్పుడూ చంద్రబాబును టార్గెట్ చేస్తున్నారు. హోదా విషయంలో బీజేపీపై ఒకటి రెండు మాటలు అంటున్నప్పటికీ.. గట్టిగా నిలదీయడం లేదని అంటున్నారు. జగన్ తీరు చూస్తుంటే.. తాము చెప్పినది నిజమేనని అర్థమవుతోందని తెలుగు తమ్ముళ్లు అంటున్నారు.
కేంద్రం నుంచి తెలుగుదేశం పార్టీ తప్పుకుంటే, ఎన్డీయేలో జగన్ చేరాలని భావిస్తున్నారని టిడిపి నేతలు ఎప్పటి నుంచో ఆరోపిస్తున్నారు. హోదా విషయంలో జగన్.. చంద్రబాబుపై దుమ్మెత్తిపోస్తూ, బీజేపీని మాత్రం ఒకటి అరా మాటలతో సరిపెట్టడం వెనుక అదే ప్లాన్ కనిపిస్తోందని అంటున్నారు.
ప్రత్యేక హోదా హామీని బీజేపీ ఇచ్చిందని, కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు పదేళ్లు కావాలని రాజ్యసభలో గొంతు చించుకున్నారని, అదే సమయంలో నిన్నటి వరకు బీజేపీ నేతలు ప్రత్యేక హోదా పైన ఏపీ ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశారని అంటున్నారు. అదే విషయం చంద్రబాబు కూడా చెప్పారని అంటున్నారు.
కేంద్రానికి దూరంగా జరిగితే కొత్తగా ఏర్పడిన ఏపీకి నష్టమనే అభిప్రాయంతో చంద్రబాబు ఉన్నారని, అందుకే హోదా తదితర విషయాల్లో చంద్రబాబు ఒకింత సాఫ్టుగానే వెళ్లి ఉంటారని, రాష్ట్రానికి ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో కచ్చితంగా కేంద్రంతో కలిసి వెళ్లాల్సి ఉంటుందని తెలుగు తమ్ముళ్లు చెబుతున్నారు.
చంద్రబాబు రాష్ట్రం కోసం ఆలోచించి కేంద్రంతో కలిసి వెళ్తున్నారని, అదే సమయంలో ప్రత్యేక హోదా, ఇతర హామీల విషయమై కేంద్రంతో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నారని అంటున్నారు. ప్రత్యేక హోదా పైన హామీని నెరవేర్చుకోని బీజేపీని గట్టిగా ప్రశ్నించకుండా, చంద్రబాబును టార్గెట్ చేయడం సరికాదంటున్నారు.
బయటకు వస్తే లాభం ఏమిటి?
బీజేపీ హోదా ఇవ్వకుంటే కేంద్రం నుంచి బయటకు రావాలని, తన కేంద్రమంత్రులను వెనక్కి పిలిపించుకోవాలని జగన్ చెబుతున్నారని, అందులో పస లేదని అంటున్నారు. మిత్రపక్షాల అవసరం లేకుండా కూడా కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండగలదని గుర్తు చేస్తున్నారు.
అయితే, మిత్రపక్షాలతో కలిసి పోటీ చేసినందువల్లనే ప్రధాని మోడీ వారికి కూడా కేంద్ర కేబినెట్లో అవకాశమిచ్చారని, మిత్రపక్షాలు.. తమంతట తాము దూరం జరుగుతానంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి వచ్చే నష్టం ఏమీ ఉండదని గుర్తు చేస్తున్నారు.
అదే సమయంలో చంద్రబాబు మొండిగా వెళ్లి, బీజేపీకి దూరం జరిగితే ఇప్పుడు వస్తున్న ఆర్థిక సాయం కూడా ఏపీకి తగ్గుతుందని, అప్పుడు రాష్ట్రం మరింత ఆర్థిక కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందని, అందుకే చంద్రబాబు కేంద్రంతో సాఫ్టుగా ఉంటూనే, హామీల కోసం పోరాడుతున్నారని తెలుగు తమ్ముళ్లు గుర్తు చేస్తున్నారు.
కానీ, జగన్ మాత్రం హోదాపై మోడీని కాకుండా చంద్రబాబునే నిలదీయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. జగన్ తన రాజకీయ వ్యూహాల్ని మరింత పదునుగా మార్చుకోవాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అదే సమయంలో ప్రత్యేక హోదా అంశాన్ని అధికార, ప్రతిపక్ష పార్టీలు రాజకీయ లబ్ధి కోసమే ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తున్నాయనే వాదనలు కూడా ఉన్నాయి.












Click it and Unblock the Notifications