వైసీపీపై అమిత్ షా అటాక్ వెనుక మరో కోణం ? ఏపీలోనూ బెంగాల్, తెలంగాణ సక్సెస్ ప్లాన్ !
ఏపీలో తాజాగా పర్యటించిన బీజేపీ అగ్రనేతలు అమిత్ షా, జేపీ నడ్డా అనూహ్యంగా వైసీపీ సర్కార్ ను టార్గెట్ చేశారు. జగన్ తో పాటు వైసీపీ నేతలు, మంత్రులు ఊహించని రీతిలో అవినీతి విమర్శలు ఎక్కుపెట్టారు. దీంతో ఇన్నాళ్లూ వైసీపీతో స్నేహంగా ఉన్న బీజేపీ నేతలు ఉన్నట్లుండి ఇలా విమర్శలు చేయడం వెనుక ఏముందనే చర్చ మొదలైంది. అయితే అంతకు ముందే ఢిల్లీకి చంద్రబాబును పిలిపించుకుని మాట్లాడిన బీజేపీ నేతలు... ఆ వెంటనే ఏపీకి వచ్చి ఇలా విమర్శలకు దిగడంతో టీడీపీతో పొత్తు పెట్టుకునేందుకు బీజేపీ ప్రయత్నాలు ప్రారంభించిందని చర్చించుకుంటున్నారు. కానీ ఇక్కడే మరో కోణం కూడా ఉంది.
ఏపీలో ప్రస్తుతం బీజేపీ పరిస్ధితి నానాటికీ తీసికట్టుగా ఉంది. మరోసారి అసెంబ్లీ, ఎంపీ ఎన్నికల్లో పోటీ చేసినా ఎక్కడా గెలిచే అవకాశాలు కనిపించడం లేదు. ఇదే పరిస్ధితి కొనసాగితే మరోసారి ఎన్నికల్లో గెలుపు లేకుండానే ముగించాల్సిన పరిస్ధితులు కనిపిస్తున్నాయి. దీంతో టీడీపీ, జనసేనతో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందన్న చర్చ జరుగుతోంది. కానీ బీజేపీ మదిలో అంతకంటే బిగ్ ప్లాన్ ఉన్నట్లు మరో ప్రచారం జరుగుతోంది. గతంలో పశ్చిమబెంగాల్, తెలంగాణలో అమలు చేసిన ఈ ప్లాన్ ను ఈసారి ఏపీలోనూ అమల్లో పెట్టబోతున్నట్లు తెలుస్తోంది.

గతంలో పశ్చిమబెంగాల్ లో అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ కు పోటీ ఇచ్చే పరిస్ధితుల్లో బీజేపీ లేదు. అలాంటి తరుణంలో టీఎంసీ నుంచి కీలక నేత అయిన సువేందు అధికారిని తమ పార్టీలోకి తీసుకొచ్చిన బీజేపీ.. రాష్ట్ర అధ్యక్షుడిని చేసి టీఎంసీని టార్గెట్ చేయడం మొదలుపెట్టింది. అప్పటికే రాష్ట్రంలో టీఎంసీకి పోటీ ఇచ్చే పరిస్దితి లేక చతికిలపడిన కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీల తరహాలో సైలెంట్ గా ఉండిపోకుండా బీజేపీ దూకుడైన రాజకీయాలు చేసింది. కేంద్రం నుంచి లభించిన సహకారంతో బీజేపీ ఇక్కడ చేసిన హంగామా ఆ పార్టీకి గెలుపు అందించకపోయినా ప్రధాన విపక్షంగా నిలబెట్టింది.
అలాగే తెలంగాణలోనూ గతంలో టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ గా రాజకీయాలు సాగుతున్న తరుణంలో 2019 లోక్ సభ ఎన్నికల్లో ఎంపీగా గెలిచిన బండి సంజయ్ ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రకటించి కేసీఆర్ పై పోరుకు ప్లాన్ చేసింది. ఊహించినట్లుగానే బండి సంజయ్ తీవ్ర విమర్శల దాడి, యాత్రలతో టీఆర్ఎస్ ను టార్గెట్ చేసేశారు. చివరికి తెలంగాణలో పోరు కాస్తా బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా మారిపోయింది. తాజాగా కర్నాటకలో కాంగ్రెస్ గెలుపుతో కాస్త పరిస్ధితి మారినా అంతిమంగా బీజేపీ మాత్రం బలమైన ప్రతిపక్షంగా మారేందుకు, కుదిరితే అధికార పీఠం అందుకునేందుకు ప్రయత్నిస్తోంది.
ఇదే తరహాలో ఏపీలోనూ విపక్షంలో ఉన్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ల విశ్వసనీయత ఇంకా ప్రశ్నార్ధకంగానే ఉంది. కాబట్టి ఇక్కడా జగన్ పై పోరు ప్రారంభించడం ద్వారా బీజేపీ బెంగాల్, తెలంగాణ ప్లాన్ అమలుకు సిద్ధమైందా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఆయా రాష్ట్రాల తరహాలోనే ఇక్కడా విపక్షాలను జీరో చేసి తామే అసలు విపక్షంలా మారాలన్న వ్యూహంతోనే అమిత్ షా, నడ్డా ఈ రేంజ్ లో విమర్శలకు దిగినట్లు తెలుస్తోంది. అయితే 9 నెలల్లో బీజేపీ వ్యూహం ఫలిస్తుందా లేకపోతే టీడీపీ, జనసేనతో కలిసి ఎన్నికలకు వెళ్తుందా అన్నది మరికొన్ని నెలల్లో తేలిపోనుంది.












Click it and Unblock the Notifications