ఎన్టీఆర్ కు భారతరత్న ఇస్తేనే సముచిత గౌరవం; చిరంజీవి డిమాండ్, పవన్ కళ్యాణ్ ఏమన్నారంటే
తెలుగువారి ఆరాధ్య దైవంగా తెలుగుజాతి కీర్తిని దశదిశలా చాటిన వ్యక్తిగా, రాజకీయాలలోనూ సంస్కరణలకు శ్రీకారం చుట్టిన మహనీయులుగా పేరుగాంచిన నందమూరి తారకరామారావు 101 వ జయంతి నేడు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఇప్పటికే సినీ, రాజకీయ రంగాల ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పించారు.
ఎన్టీఆర్ పై చిరంజీవి ట్వీట్
ఇక తాజాగా చిరంజీవి ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ లో ఆయన కొన్ని ఆసక్తికరమైన విషయాలను పేర్కొని, ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలనే డిమాండ్ ను ఆయన కేంద్ర ప్రభుత్వం ముందు ఉంచారు. చిరంజీవి తను చేసిన ట్వీట్ కొందరి కీర్తి అజరామరం. తరతరాలు శాశ్వతం. భావితరాలకు ఆదర్శం అంటూ పేర్కొన్నారు.

ఎన్టీఆర్ కు భారతరత్న డిమాండ్ చేసిన చిరంజీవి
నందమూరి తారక రామారావు గారిని ఈ రోజు గుర్తుచేసుకుంటూ, వారు ప్రజా జీవితంలో చేసిన సేవలకు భారతరత్న పురస్కారం సముచిత గౌరవం అని భావిస్తున్నానని చిరంజీవి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తెలుగు వారి ఈ చిరకాల కోరికని కేంద్ర ప్రభుత్వం తప్పక మన్నిస్తుందని ఆశిస్తున్నాను అంటూ ఆయన పేర్కొన్నారు. చిరంజీవి భుజం పైన ఎన్టీఆర్ చేతులు వేసినట్టు ఉన్న ఒక ఫోటోను ఈ సందర్భంగా ఆయన ట్వీట్ చేశారు.
ఎన్టీఆర్ మనవారని తెలుగువారు గర్వంగా చెప్పుకోవచ్చు: పవన్ కళ్యాణ్
ఇక మరోవైపు జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఒక ప్రకటన విడుదల చేశారు. ఇందులో పవన్ కళ్యాణ్ తెలుగు నుడికారానికి, తెలుగు నేలకు, తెలుగుజాతికి మరింత సొబగులు అద్దిన వారిలో మనం ఎన్టీఆర్ గా పిలుచుకునే స్వర్గీయ నందమూరి తారకరామారావు గారు ఒకరని తెలుగువారు కించిత్ గర్వంగా చెప్పుకోవచ్చు అని పేర్కొన్నారు.
ఎన్టీఆర్ సంస్కరణలు చిరస్థాయిగా నిలిచిపోయాయి :పవన్ కళ్యాణ్
అటువంటి గొప్ప వ్యక్తి జయంతి సందర్భంగా అంజలి ఘటిస్తున్నాను అని వెల్లడించారు. సినీ రంగంలోనూ ఇటు రాజకీయ రంగంలోనూ ఆయనదైన శైలి అజరామరం అంటూ కితాబిచ్చారు. రెవిన్యూ వ్యవస్థలో ఎన్టీఆర్ గారు తీసుకువచ్చిన సంస్కరణలు, రెండు రూపాయలకే పేదలకు బియ్యం వంటి పథకాలు చిరస్థాయిగా నిలిచిపోయాయి అన్నారు. ఆయన జయంతిని పురస్కరించుకుని నా పక్షాన జనసేన పార్టీ పక్షాన ఆయనకు నివాళులర్పిస్తున్నానని పవన్ కళ్యాణ్ ప్రకటన లో పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications