ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలి.. లోక్‌సభలో ఎంపీ గల్లా జయదేవ్
తెలుగుదేశం పార్టీ 40వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్న టిడిపి నేతలు సంబరాలు జరుపుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావమై 40 ఏళ్లు పూర్తయిందని, తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం నాడు ఎన్టీఆర్ పెట్టిన పార్టీ తెలుగు రాష్ట్రాల ఖ్యాతిని ఇనుమడింపచేసింది అని గుర్తు చేసుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా విదేశాలలో సైతం టీడీపీ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.

టీడీపీ ప్రజల ఆకాంక్షల నుండి పుట్టిన పార్టీ: చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ ప్రజల కోసం ప్రజల ఆకాంక్షల నుంచి పుట్టింది పార్టీ అని టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆయన టిడిపి నేతలు, కార్యకర్తలు, అభిమానులు అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. 40 సంవత్సరాల క్రితం ఎన్టీఆర్ చేతుల మీదుగా తెలుగుదేశం ఆవిర్భవించిందని అది ఒక రాజకీయ అనివార్యమని ఆయన పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ కొందరు వ్యక్తులు కోసం, కొందరు పదవుల కోసం ఏర్పడిన పార్టీ కాదని వెల్లడించారు, పేదలకు కూడు, గూడు, గుడ్డ నినాదంతో ఈ నలభై ఏళ్లలో సామాన్య ప్రజల జీవితాలలో పెను మార్పులు తీసుకు వచ్చిందని చంద్రబాబు వెల్లడించారు.
ఎన్టీఆర్ ను గుర్తు చేసుకుని కేంద్రం వద్ద గల్లా జయదేవ్ డిమాండ్
ఆత్మగౌరవమే నినాదంగా, వెనుకబడిన వర్గాలకు అండగా, ప్రగతిశీల రాజకీయాలకు దర్పణంగా నిలవాలనే ఉద్దేశంతో స్థాపించిన పార్టీ తెలుగు దేశం అని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ పేర్కొన్నారు. మన పార్టీ 40వ ఆవిర్భావ దినోత్సవం సందర్భగా మన వ్యవస్థాపకులు, అన్నగారు ఎన్ టీ రామారావుగారికి నివాళులు అర్పించామని ఆయన వెల్లడించారు. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకొని తెలుగుదేశం పార్టీ నేత గల్లా జయదేవ్ కేంద్రం వద్ద ఒక డిమాండ్ ఉంచారు.

ఎన్టీఆర్ కు భారత రత్న ఇవ్వాలని గల్లా జయదేవ్ డిమాండ్
తెలుగుదేశం పార్టీని స్థాపించి, తెలుగు ప్రజలకు ఆత్మ గౌరవాన్ని సంపాదించిపెట్టిన, ప్రజలకు ఎనలేని సేవ చేసిన ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని లోక్సభలో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ డిమాండ్ చేశారు. పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ తెలుగుదేశం పార్టీతో పాటు ఆ పార్టీని స్థాపించిన ఎన్టీఆర్ పేరును గుర్తుచేసి నలభై వసంతాల పండుగ జరుపుకుంటున్న విషయాన్ని పార్లమెంటులో ప్రస్తావించారు.
Recommended Video


రాజకీయాలలో ఎన్టీఆర్ కు ప్రత్యేక స్థానం ఉందన్న జయదేవ్
రాజకీయాల్లో ఎన్టీఆర్ కోన ప్రత్యేక స్థానాన్ని గుర్తించాలని గల్లా జయదేవ్ లోక్సభలో విజ్ఞప్తి చేశారు. రాజకీయాల్లో సత్తాచాటిన ఎన్టీఆర్ కు, రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన ఆయనకు భారతరత్న అవార్డు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కిలో 2 రూపాయలకే బియ్యం అందించి ఎన్టీఆర్ పేదల ఆకలి తీర్చారని, మద్యపాన నిషేధం కోసం ఎన్టీఆర్ ఎంతో కృషి చేశారని గల్లా జయదేవ్ పేర్కొన్నారు. భారతరత్నకు ఎన్టీఆర్ అన్ని విధాలా అర్హుడని గల్లా జయదేవ్ వెల్లడించారు. ఇక ఎన్టీఆర్ కు భారతరత్న అవార్డు ఇవ్వాలని చాలా కాలంగా డిమాండ్ వినిపిస్తోంది. ఈ క్రమంలో తాజాగా మరోమారు గల్లా జయదేవ్ లోక్సభలో ఈ విషయాన్ని ప్రస్తావించారు. తెలుగు దేశం పార్టీ దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన విషయాన్ని కూడా గల్లా జయదేవ్ సభ దృష్టికి తీసుకువెళ్లారు.












Click it and Unblock the Notifications