ఆదిపురుషుడికి భారత రత్న: ఈ సారి ప్రధాని మోడీకీ లేఖ: రూటు మార్చిన రఘురామ
అమరావతి: అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తిరుగుబాటు లోక్‌సభ సభ్యుడిగా ముద్రపడిన నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు.. తన రూటు మార్చారు. నవ ప్రభుత్వ కర్తవ్యాలు పేరుతో కొద్దిరోజులుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వరుసబెట్టి లేఖలు రాస్తోన్న ఆయన.. దాన్ని కొనసాగిస్తూనే- తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీకీ లెటర్ రాశారు. మాజీ ప్రధానమంత్రి, దివంగత పీవీ నరసింహారావుకు దేశ అత్యున్నత పౌర పురస్కారం- భారత రత్నను ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. పీవీ నరసింహారావు శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకుని రఘురామ ఈ లేఖ రాశారు.
దేశంలో ప్రజా అనుకూల ఆర్ధిక సంస్కరణలను అమలు చేసిన ఆర్థికవేత్తగా పీవీ నరసింహారావును అభివర్ణించారు. ఆర్థిక సంస్కరణలకు పీవీ నరసింహారావు ఆదిపురుషుడిగా నిలిచారని అన్నారు. ఆర్థిక రంగానికి పీవీ నరసింహారావు చెక్కు చెదరని పునాదులు వేశారని చెప్పారు. ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమైనవని పేర్కొన్నారు. 90వ దశకంలోనే చుట్టుముట్టిన ఆర్థిక సమస్యల నుంచి దేశాన్ని అవలీలగా బయటికి తీసుకు వచ్చిన ఘనత పీవీ నరసింహారావు మాత్రమే దక్కుతుందని చెప్పారు.

ఆయన చేసిన కృషి, ముందుచూపు, తీసుకొచ్చిన సంస్కరణల వల్ల దేశం ఆర్థిక రంగంలో ఎదురైన అనేక సవాళ్లను సైతం తట్టుకుని నిలిచిందని చెప్పారు. పీవీ నరసింహారావు శత జయంత్యుత్సవాలను పురస్కరించుకుని ఆయనను అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నతో గౌరవించాలని రఘురామ కృష్ణంరాజు ప్రధాని మోడీకి విజ్ఞప్తి చేశారు. పీవీకి భారతరత్న పురస్కారాన్ని ప్రకటించడం వల్ల ప్రపంచవ్యాప్తంగా స్థిరపడిన 20 కోట్ల మంది తెలుగువారు మాత్రమే కాకుండా.. ప్రతి భారతీయుడు కూడా గర్వపడుతారని రఘురామ తన లేఖలో రాశారు. ఈ అవార్డును ప్రకటించడానికి పీవీ శతజయంతి ఉత్సవాలు ఓ మంచి సందర్భమని అభిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications