అఖిలప్రియ డిసైడ్ అయ్యారా - అడుగులు అటు వైపే..!?
భూమా అఖిల ప్రియ కీలక వ్యాఖ్యలు చేసారు. ఆళ్లగడ్డ..నంద్యాల నియోజకవర్గాల్లో తమ ఆధిపత్యం కొనసాగాలని అఖిల కోరుకుంటున్నారు. గత కొంత కాలంగా వరుస వివాదాల్లో నిలుస్తున్న అఖిల ఇప్పుడు తాజాగా చేసిన వ్యాఖ్యలు టీడీపీలో చర్చకు కారణమయ్యాయి. నంద్యాల నియోజకవర్గంకు సంబంధించి పార్టీ అధినేత చంద్రబాబు తాజాగా సమీక్ష చేసారు. కీలక సూచనలు చేసారు. ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ జిల్లాలో నంద్యాల రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది.
ఆసక్తి కరంగా నంద్యాల రాజకీయం : రానున్న ఎన్నికలు టీడీపీకి నవ్ ఆర్ నెవర్ గా మారుతున్నాయి. జనసేనతో పొత్తుతో ముందుకు వెళ్లాలని టీడీపీ భావిస్తోంది. బీజేపీ కలిసి వస్తుందా లేదా అనేది ఇంకా స్పష్టత లేదు. సీఎం జగన్ ను ఓడించాలంటే ముందుగా రాయలసీమ పైన చంద్రబాబు ఫోకస్ చేసారు. అందునా కర్నూలు జిల్లా వైసీపీకి కంచుకోటగా ఉంది. 2019 ఎన్నికల్లో వైసీపీ జిల్లాలో 14 సీట్లలోనూ గెలిచి క్లీన్ స్వీప్ చేసింది.

రెండు లోక్ సభ స్థానాల్లోనూ విజయం సాధించింది. ఈ సారి ఎన్నికల్లో భాగంగా చంద్రబాబు జిల్లా నుంచే ముందుగా ప్రాజెక్టు బాట ప్రారంభించారు. ఇక, జిల్లాలో నంద్యాల నియోజకవర్గ సమీక్ష చేసిన చంద్రబాబు పార్టీ అభ్యర్ధి విషయంలో మాత్రం ఆచితూచి వ్యవహరిస్తున్నారు. దీనికి సంబంధించి పార్టీ నేతలకు కీలక సూచనలు చేసారు.
చంద్రబాబు ఆచితూచి : నంద్యాల నుంచి టీడీపీ టికెట్ కోసం ముగ్గురు నేతలు పోటీ పడుతున్నారు. మాజీ మంత్రి ఫరూక్, మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి, సుబ్బారెడ్డి టికెట్ ఆశిస్తున్నారు. నియోజకవర్గం పైన వీరితో సమావేశమైన చంద్రబాబు అందరూ సమిష్టిగా పార్టీ కోసం పని చేయాలని సూచించారు. ఇంఛార్జ్ ఎవరనేది స్పష్టత ఇవ్వలేదు.
ఆళ్లగడ్డతో పాటుగా నంద్యాలలోనూ తమ కుటుంబ సభ్యులకే సీటు కావాలని భూమా అఖిల ప్రియ భావిస్తున్నారు. అందులో భాగంగానే టీడీపీ నేత లోకేశ్ యువగళం యాత్ర సమయంలో అఖిల ప్రియ మద్దతు దారులు సుబ్బారెడ్డి పైన దాడికి దిగారు. దీని పైన టీడీపీ నాయకత్వం ఆగ్రహంతో ఉంది. ఇప్పుడు తిరిగి నంద్యాల పైన అఖిల ప్రియ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

అఖిల తాజా వ్యాఖ్యలతో : నంద్యాల వెళ్లవద్దని తనకు ఎవరూ చెప్పలేదని అఖిల ప్రియ వ్యాఖ్యానించారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎక్కడికైనా వెళ్లే అధికారం తనకు ఉందన్నారు. నంద్యాల నుంచి తనను వేరు చేయలేరని అఖిల ప్రియ కీలక వ్యాఖ్యలు చేసారు. తన రక్తంలోనే నంద్యాల ఉందంటూ తన లక్ష్యం ఏంటో తేల్చి చెప్పారు.
దీంతో, నంద్యాల నుంచి అఖిల తన సోదరుడిని బరిలోకి దింపేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు పార్టీలో ప్రచారం సాగుతోంది. తాజాగా అఖిల సోదరి మౌనిక తన భర్త మనోజ్ తో కలిసి చంద్రబాబుతో సమావేశమయ్యారు. త్వరలోనే రాజకీయ ఎంట్రీ ఉంటుందని మనోజ్ స్పష్టం చేసారు. వచ్చే ఎన్నికల్లో మనోజ్ పోటీ చేసే అవకాశం ఉంది. దీంతో, ఇప్పుడు నంద్యాల..ఆళ్లగడ్డ సీటు విషయంలో చంద్రబాబు తీసుకొనే నిర్ణయంపైన ఉత్కంఠ కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications