Mudragada Padmanabham: ముద్రగడ పద్మనాభం ఇక లేరు..! శోకసంద్రంలో అభిమానులు..!
ఏపీ మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత, ప్రస్తుతం వైఎస్సార్సీపీలో ఉన్న ముద్రగడ పద్మనాభం (Mudragada Padmanabham) కొద్దిసేపటి క్రితం కన్నుమూశారు. తాజాగా తీవ్ర అనారోగ్యం పాలైన ఆయన్ను హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చి ఐసీయూలో చికిత్స అందించారు. అనంతరం కాస్త కోలుకోవడంతో ఆయన స్వగ్రామం కిర్లంపూడిలో ఉన్న ఇంటికి తరలించాలని కుటుంబ సభ్యులు భావించారు. అయితే ముద్రగడ ఆరోగ్యం కుదుటపడకపోవడంతో అదే ఆస్పత్రిలో ఉండి చికిత్స తీసుకుంటున్న ముద్రగడ ఇవాళ ఆరోగ్యం విషమించడంతో ఇవాళ తుదిశ్వాస విడిచారు. దీంతో ఆయన అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు.
1953 జనవరి 22న ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని కిర్లంపూడి గ్రామంలో జన్మించిన ముద్రగడ పద్మనాభం యువకుడిగా ఉన్నప్పటి నుంచే నాయకత్వ లక్షణాలతో ఎదిగారు. ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ముద్రగడ.. రెండు సార్లు మంత్రిగా కూడా పనిచేశారు. అలాగే కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎంపీగా కూడా గెలిచారు. తన సామాజిక వర్గమైన కాపుల కోసం ముద్రగడ ఎన్నో ఉద్యమాలు చేశారు. ఈ క్రమంలో ఎన్ని ఇబ్బందులు, వేధింపులు, కేసులు ఎదురైనా వెనక్కి తగ్గలేదు.

చంద్రబాబు గత ప్రభుత్వంలో కాపులకు ఐదు శాతం రిజర్వేషన్లు కల్పించాలంటూ ముద్రగడ చేసిన పోరాటం చరిత్రలో కీలకంగా నిలిచింది. అప్పట్లో జరిగిన తుని రైలు దహనం ఘటనలో ముద్రగడతో పాటు ఆయన అనుచరులు కూడా రైల్వే కేసులు ఎదుర్కొన్నారు. ఆ తర్వాత వాటికి ఆధారాలు లేవంటూ రైల్వే కోర్టు కొట్టేసింది. ఆ తర్వాత వైఎస్సార్సీపీలో చేరిన ముద్రగడ.. గత ఎన్నికల్లో తొలిసారి పిఠాపురం నుంచి పోటీ చేసిన పవన్ కళ్యాణ్ గెలిస్తే ముద్రగడ పద్మనాభరెడ్డిగా పేరు మార్చుకుంటానని సవాల్ విసిరారు. పవన్ గెలుపుతో ఆయన అధికారికంగా ముద్రగడ పద్మనాభరెడ్డిగా పేరు కూడా మార్చుకున్నారు. రాజకీయాల్లో విలువలు కలిగిన వ్యక్తిగా, అవినీతి మరకలు అంటని నాయకుడిగా, ఎవరికైనా ఇవ్వడమే తప్ప తీసుకోవడం తెలియని వ్యక్తిగా ముద్రగడకు పేరుంది. ఇప్పుడు ముద్రగడ మృతితో కాపు సామాజిక వర్గం ఓ దిగ్గజ నేతను కోల్పోయినట్లయింది.












Click it and Unblock the Notifications