అఖిలప్రియకు మంత్రి పదవి?: భూమా నాగిరెడ్డిపై రౌడీషీట్ ఎత్తివేత!
కర్నూలు: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి టిడిపిలో చేరిన నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డిపై పోలీసులు నమోదు చేసిన రౌడీషీట్ ఎత్తివేతకు అంతా సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఆయనపై సుమారు రెండేళ్ల క్రితం పోలీసులు రౌడీషీట్ నమోదు చేసిన విషయం తెలిసిందే. ఆ కేసులో భూమా నాగిరెడ్డి రిమాండుకు కూడా వెళ్లి వచ్చారు. ప్రస్తుతం ఆ కేసు విచారణలో ఉంది.
ఈ క్రమంలోనే ఈ ఏడాది ప్రారంభంలో ఆయన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. దీంతో ఆ తర్వాత ఆయనను మంత్రివర్గంలో చేర్చుకుంటారని ప్రచారం జరిగింది. గత జూన్‌లోనే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని భావించినా జాప్యం జరుగుతూ వచ్చింది.

తాజాగా దసరా పండగ నాటికి మంత్రివర్గ విస్తరణ కార్యక్రమం ముగించాలన్న ఆలోచనలో ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబునాయుడు ఉన్నారని, దీనిపై కసరత్తు చేస్తున్నారని టిడిపి వర్గీయుల్లో చర్చ సాగుతోంది. ఈ క్రమంలో భూమా నాగిరెడ్డిని కాకుండా ఆయన కుమార్తె భూమా అఖిలప్రియను మంత్రివర్గంలో చేర్చుకోవాలన్న ఆలోచన కూడా సీఎం చేసినట్లు తెలుస్తోంది.
అయితే జిల్లాలో టిడిపి బలం పెరగాలంటే నాగిరెడ్డికి మంత్రి పదవి ఇస్తే పార్టీ అభివృద్ధికి ఉపయోగపడుతుందని పార్టీ సీనియర్లు సూచించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో వారి వాదనకు సానుకూలంగా స్పందించిన చంద్రబాబు.. మనసు మార్చుకున్నారని సమాచారం.

అయితే మంత్రిగా రౌడీషీట్ ఉన్న ఎమ్మెల్యేకు అవకాశమిస్తే ఆరోపణలు వస్తాయన్న కారణంగా నిబంధనల ప్రకారం రౌడీషీట్ ఎత్తివేతకు చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించినట్లు తెలుస్తోంది. దీంతో నంద్యాల పోలీసులు ఆ మేరకు నివేదిక సిద్ధం చేసి జిల్లా ఎస్పీ ఆకే రవికృష్ణకు పంపినట్లు సమాచారం.
ఆ నివేదికను ఎస్పీ పరిశీలించి సంతృప్తి చెందితే రౌడీషీట్ ఎత్తివేతకు పోలీసులకు ఆదేశాలు జారీ అవుతాయని ఆ శాఖ అధికారుల ద్వారా తెలిసింది. దీనిపై కొద్ది రోజుల్లోనే నిర్ణయం వెలువడుతుందని వారంటున్నారు. దీంతో భూమా నాగిరెడ్డి మంత్రిపదవికి లైన్ క్లియర్ అయినట్లేనని తెలుగుదేశం నేతలు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications