రోజాను తుద ముట్టించే ప్రయత్నం చేస్తున్నారు: భూమన ఆరోపణ
తిరుపతి: చిత్తూరు జిల్లా నగరిలో తమ పార్టీ శాసనసభ్యురాలు రోజాను తుదముట్టించే ప్రయత్నాలు చేస్తున్నారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మాజీ శాసనసభ్యుడు భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి సొంత జిల్లా చిత్తూరులో పోలీసల అకృత్యాలు మితిమీరుతున్నాయని ఆయన అన్నారు.
శాసనసభ్యురాలు రోజాపై, ఆమె అనుచరులపై అక్రమ కేసులు బనాయిస్తూ పోలీసులు వేధిస్తున్నారని ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడి ఒత్తిడి వల్లనే తమ నేతలను పోలీసులు లక్ష్యంగా చేసుకుంటున్నారని ఆయన ఆరోపించారు. టిడిపి నేతలు, పోలీసుల దౌర్డన్యాలను ఎదుర్కుంటామని ఆయన చెప్పారు.
ప్రజలను మోసగిస్తున్న చంద్రబాబు

కేంద్ర ప్రభుత్వ హామీల అమలుకు కృషి చేస్తామని ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలను మోసం చేస్తున్నారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కారుమూరి వెంకట నాగేశ్వర రావు విమర్శించారు. ప్రణబ్ కమిటీకి లేఖ ఇచ్చి చంద్రబాబు తెలంగాణకు అనుకూలంగా వ్యవహరించారని ఆయన అన్నారు.
విభజన సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇ్వాలని ప్రజలంతా కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. విదేశీ పర్యటనల ద్వారా రాష్ట్రానికి పరిశ్రమలు రావని, ప్రత్యేక హోదాతోనే పూర్తి స్థాయిలో రాష్ట్రానికి న్యాయం జరుగుతుందని ఆయన అన్నారు.
తమను మోసం చేస్తన్న చంద్రబాబుకు ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గరపడ్డాయని ఆయన అన్నారు. నిర్మాణం పూర్తి కాకుండా పట్టిసీమ పథకాన్ని చంద్రబాబు జాతికి ఎలా అంకితం చేస్తారని ఆయన అడిగారు. కనీసం కాలువలు కూడా పూర్తి కాకుండానే చంద్రబాబు హడావిడి చేస్తున్నారని ఆయన అన్నారు.
పట్టి సీమ ప్రాజెక్టుపై చూపిస్తున్న శ్రద్ధను చంద్రబాబు పోలవరం ప్రాజెక్టుపై ఎందుకు చూపడం లేదని ఆయన ప్రశ్నించారు. కేవలం కమిషన్ల కోసమే పట్టిసీమ, రాజధాని నిర్మాణాల చుట్టూ చంద్రబాబు ప్రదక్షిణలు చేస్తున్నారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications