TTD:భూమన బాధ్యతల స్వీకరణ - తొలి లక్ష్యం ఖరారు..!!
Tirumala: తిరుమల తిరుపతి దేవస్థాన పాలకమండలి చైర్మన్‌గా ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. తిరుమల కొండపై కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరస్వామిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న అనంతరం గరుడాళ్వార్ సన్నిధిలో టీటీడీ చైర్మన్ బాధ్యతలు చేపట్టారు. రంగనాయక మండపంలో భూమన కరుణాకర్‌రెడ్డికి అర్చకులు వేద ఆశీర్వచనం అందజేశారు. బ్రహ్మోత్సవాల నిర్వహణ పైన భూమన దృష్టి పెట్టారు.
భూమన బాధ్యతల స్వీకరణ : టీటీడీ చైర్మన్‌గా ఎమ్మెల్యే భూమన రెండోసారి బాధ్యతలు స్వీకరించారు. వైవీ సుబ్బారెడ్డి పదవీ కాలం ముగియటంతో సీఎం జగన్ టీటీడీ బాధ్యతలు భూమనకు అప్పగించారు.వైయస్ రాజశేఖరరెడ్డి హయాంలో 2006 నుంచి 2008 వరకు టీటీడీ చైర్మన్‌గా భూమన కరుణాకర్‌రెడ్డి పనిచేశారు. తనను టీటీడీ ఛైర్మన్ గా నియమించినందుకు ముఖ్యమంత్రి వైయస్ జగన్‌కు ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ ఉదయం గంటలకు పద్మావతి పురంలోని ఇంటి వద్ద నుంచి బయలుదేరిన భూమన గ్రామ దేవత తాతయ్య గుంట గంగమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అలిపిరి వద్ద గోపూజ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు.భూమనకు టీటీడీ జీఈవో సదా భార్గవి స్వాగతం పలికారు.
బ్రహ్మోత్సవాల పై దృష్టి : అలిపిరి నుంచి తిరుమలకు చేరుకున్నారు. శ్రీవారి ఆలయంలో ఉదయం 11: 44 గంటలకు టీటీడీ చైర్మన్‌గా భూమన ప్రమాణ స్వీకారం చేశారు. భూమన బాధ్యతల స్వీకరణ పథ్యంలో తిరుపతి నగరంలో అభిమానులు భారీ ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ ఏడాది తిరుమలలొ రెండు పర్యాయాలు శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి.
ఈ ఏడాది సెప్టెంబర్ 18 నుంచి సాలకట్ల బ్రహ్మోత్సవాలు , అక్టోబర్ 15 నుంచి నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించాలని టీడీడీ నిర్ణయించింది. ఛైర్మన్ గా భూమన ముందుగా ఈ బ్రహ్మోత్సవాల నిర్వహణ దృష్టి పెట్టారు. బ్రహ్మోత్సవాల సమయంలో వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తూ ఇప్పటికే టీటీడీ నిర్ణయం తీసుకుంది.

బోర్డు కూర్పుపైనా కసరత్తు : ఇక, కొత్త పాలక మండలి ఏర్పాటు పైన ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఒకటి, రెండు రోజుల్లో అధికారికంగా టీటీడీ నూతన పాలకమండలిని నియమిస్తూ ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. ఎన్నికల సమయం కావటంతో సభ్యుల ఎంపిక విషయంలో ఆచి తూచి నిర్ణయం తీసుకుంటున్నారు. ఏపీతో పాటుగా తెలంగాణ, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక నుంచి సభ్యుల ఎంపిక చేయనున్నారు.
టీటీడీ పైన ప్రతిపక్షాలు ఉద్దేశ పూర్వకంగా ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో వాటిని తప్పి కొట్టటంతో పాటుగా టీటీడీ పాలనలో అనుభవం ఉన్న భూమన ను సీఎం జగన్ ఏరి కోరి ఎంపిక చేసినట్లు చెబుతున్నారు. ఇదే విధంగా టీటీడీ సభ్యుల విషయంలోనూ నిర్ణయం తీసుకొనే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications