‘మహేష్ బాబును చేద్దామనుకుంటే సంపూర్ణేష్ బాబు కూడా కాలేదు’
కర్నూలు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబునాయుడు తనయుడు నారా లోకేష్‌పై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. తన కుమారుడు లోకేష్‌ను సూపర్ స్టార్ కృష్ణ కుమారుడు మహేష్ బాబులా చేద్దామని భావించారని.. కనీసం సంపూర్ణేష్ బాబులా కూడా తయారు చేయలేక పోయారని వైయస్సార్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి భూషణం ఎద్దేవా చేశారు.
కర్నూలులో జరుగుతున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి జలదీక్షలో ఆయన మంగళవారం పాల్గొని ప్రసంగించారు. భూషణం చేసిన వ్యాఖ్యలు వేదికపై నవ్వులు పూయించగా, అక్కడున్న ప్రజలు, జగన్ అభిమానులు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు.

లోకేష్‌ను మోహన్ బాబులా తీర్చిదిద్దాలని భావించిన చంద్రబాబు కనీసం బాబూ మోహన్‌లా కూడా మార్చలేకపోయారని మరోసారి ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఎక్కడ ఉంటే అక్కడ కరవు వుంటుందని అన్నారు.
చంద్రబాబు వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడరని, తొలుత కాంగ్రెస్‌కు, ఆపై పిల్లనిచ్చిన మామకు, అటుపై తమ్ముడు రామ్మూర్తి నాయుడికి, తోడల్లుడు దగ్గుబాటికి, చివరిగా జూనియర్ ఎన్టీఆర్‌ను మోసం చేశారని దుయ్యబట్టారు.
అబద్ధపు హామీలతోనే బాబు అధికారంలోకి వచ్చాడని ఆయన విమర్శించారు. ప్రజలకు మేలు కలగాలంటే జగన్ అధికారంలోకి రావాలని కోరారు. అవసరమైతే, తెలంగాణ సీఎం కేసీఆర్ ఇంటి ముందు కూడా ధర్నా చేస్తామని భూషణం తేల్చి చెప్పారు.












Click it and Unblock the Notifications