విభజన రాజకీయాలు: చంద్రబాబు వర్సెస్ షర్మిల
హైదరాబాద్: రాష్ట్ర విభజన ప్రతిపాదనపై వైయస్సార్ కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు పరస్పరం దుమ్మెత్తి పోసుకుంటున్నాయి. ఈ రాజకీయ రగడ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వర్సెస్ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకురాలు వైయస్ షర్మిలగా మారింది. ఇరువురు నేతలు సీమాంధ్రలో బస్సు యాత్రలు చేపట్టి పరస్పరం నిందించుకునే పనికి పూనుకున్నారు. చంద్రబాబు తన సీమాంధ్ర మొదటి విడత పర్యటనను బుధవారంతో ముగించారు. షర్మిల మాత్రం ఇంకా కొనసాగిస్తున్నారు. ఆమె సమైక్య శంఖారావం బస్సు యాత్ర గురువారం కృష్ణా జిల్లాలో కొనసాగింది.
రాష్ట్ర విభజనకు వైయస్ రాజశేఖర రెడ్డి పునాదులు వేశారని, రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకోవచ్చునని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ చెప్పిందని చంద్రబాబు అన్నారు. నిజానికి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ తల్లి, పార్టీ గౌరవాధ్యక్షురాలు తెలంగాణ ప్రజల మనోభావాలను తాము గౌరవిస్తున్నామని పలుమార్లు చెప్పారు. తెలంగాణ అమరవీరులకు నివాళులు కూడా ఆర్పించారు. తెలంగాణపై తమను నిందించడ సరి కాదని, తాము ఇచ్చేవాళ్లం గానీ తెచ్చేవాళ్లం గానీ కాదని ఆమె అన్నారు. తెలంగాణ సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిది, అధికార కాంగ్రెసు పార్టీదని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు చెబుతూ వచ్చారు.

రాష్ట్రాన్ని విభజించాలని తాము కేంద్రానికి లేఖ ఇవ్వలేదని షర్మిల గురువారం కృష్ణా జిల్లా పర్యటనలో అన్నారు. విభజనకు చంద్రబాబు లేఖ ఇచ్చి మొసలి కన్నీరు కారుస్తున్నారని ఆమె వ్యాఖ్యానించారు. చంద్రబాబు అండతోనే కాంగ్రెసు అధిష్టానం రాష్ట్ర విభజనకు నిర్ణయం తీసుకుందని ఆమె అన్నారు. విభజన గురించి ముందే తెలిసినా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అడ్డు చెప్పలేదని ఆమె అన్నారు. చంద్రబాబును విభజన నిర్ణయంలో ప్రధాన దోషిగా నిలబెట్టేందుకు షర్మిల తన ప్రసంగాల ద్వారా ప్రయత్నిస్తున్నారు.
చంద్రబాబు అదే స్థాయిలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీపై విరుచుకుపడ్డారు. తాను మొదటి నుంచి విభజనకు వ్యతిరేకంగానే వ్యవహరిస్తూ వచ్చానని చెప్పుకొచ్చారు. అనివార్య పరిస్థితిలో తాను తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని కూడా చెప్పారు. కానీ, ఆయన సమైక్యాంధ్రకు అనుకూల కంఠస్వరాన్నే తీసుకున్నారు. తెలంగాణలో వ్యతిరేకత రాకుండా సీమాంధ్రులను నమ్మించాలనే వ్యూహంలో భాగంగానే ఆయన ప్రసంగాలు సాగాయి. రాష్ట్ర విభజన తీరును ఆయన వ్యతిరేకిస్తూ వచ్చారు. వైయస్సార్ కాంగ్రెసు, కాంగ్రెసు, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) కుమ్మక్కయి తమ పార్టీని దెబ్బ తీయాలని ప్రయత్నాలు చేస్తున్నాయని ఆయన విమర్శించారు.

అయితే, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ గానీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గానీ కాంగ్రెసు అధిష్టానం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంటుందని ఊహించలేదు. సీమాంధ్ర పార్టీ నాయకుల వ్యతిరేకతను కాదని తెలంగాణకు అనుకూలంగా కాంగ్రెసు అధిష్టానం నిర్ణయం తీసుకోవడం దుర్లభమనే అంచనాలతోనే వారిద్దరు ఉన్నారు. దాంతో కాంగ్రెసు అధిష్టానం నిర్ణయం తీసుకుని, తమ పార్టీలను కూడా అందులో భాగం చేయాలని ప్రయత్నించడంతో ఆ రెండు పార్టీల నాయకులు బిత్తరపోక తప్పలేదు. దాంతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సమైక్యాంధ్ర రాగాన్ని అందుకుని తెలంగాణను వదిలేసింది. తెలంగాణలో పార్టీ నష్టపోయినా పట్టించుకోలేదు.
అందుకు భిన్నంగా చంద్రబాబు వ్యవహరించారు. రాష్ట్ర విభజనకు తొలుత అంగీకరించి, సీమాంధ్ర రాష్ట్ర రాజధాని ఏర్పాటుకు ప్యాకేజీని డిమాండ్ చేశారు. వైయస్సార్ కాంగ్రెసు సీమాంధ్రలో సమైక్య నినాదంతో దూసుకుపోవడానికి నిర్ణయించుకోవడంతో, కాంగ్రెసు సీమాంధ్ర నాయకులు కూడా విభజనకు వ్యతిరేకంగా గొంతు ఎత్తడంతో ఆయన తన బాణీ మార్చుకున్నారు. ఏమైనా, కాంగ్రెసు అధిష్టానం తాను చేయదలుచుకున్నదే చేస్తుందనేది నిస్సందేహం.












Click it and Unblock the Notifications