విభజన సెల్ఫ్‌గోల్: జైరాం షాకింగ్, 'కేసీఆర్‌ను బాబు తీసుకున్నా, వైయస్ బతికున్నా..'
అమరావతి: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి జైరాం రమేష్ విభజన అంశంపై శనివారం నాడు ఆసక్తికర, సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ - తెలంగాణ రాష్ట్రాల విభజన జరిగి రెండేళ్లు దాటింది. ఈ సమయంలో ఆయన విభజనను కాంగ్రెస్ పార్టీ సెల్ఫ్ గోల్‌గా అభివర్ణించారు.
విభజన జరిగి రెండేళ్లే అవుతోందని, ఇలాంటి సమయంలో విభజన వల్ల నష్టమా, లాభమా ఇప్పుడే చెప్పడం సరికాదని, అయితే ఇరు రాష్ట్రాలకు ఇచ్చిన హామీలను కేంద్రం నెరవేర్చాలని ఆయన అన్నారు. ఏపీకి రాజధాని నిర్మాణం, ప్రత్యేక హైకోర్టు, ఇతర హామీలు వెంటనే నెరవేర్చాలన్నారు.

రాష్ట్ర విభజన కాంగ్రెస్ పార్టీ చేసుకున్న సెల్ఫ్ గోల్ అన్నారు. విభజన నేపథ్యంలో ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. తెలంగాణలో కష్టంగా ప్రతిపక్ష హోదా దక్కించుకుంది. ఇప్పుడు ఆ పార్టీ ఎమ్మెల్యేలు అధికార తెరాసలో చేరుతున్నారు.
ఈ నేపథ్యంలో జైరాం రమేష్ శనివారం నాడు మాట్లాడారు. సీపీఎం మినహా అన్ని పార్టీలు లిఖితపూర్వకంగా విభజనకు ఓకే చెబుతూ మద్దతు ఇచ్చాయని చెప్పారు. టిడిపి, వైసీపులు కూడా లేఖలు ఇచ్చాయన్నారు. మొత్తానికి ఏపీ నుంచి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఎలా అభివర్ణించాలో కూడా ఆయన చెప్పలేకపోయారు.

ఇది విభజన కాదని, రెండు రాష్ట్రాలుగా చేయడమని చెప్పారు. అంతలోనే, 1953లో విలీనమైన ఆంధ్ర, హైదరాబాదులను మళ్లీ వేరు చేశామంటే సరిగ్గా ఉంటుందన్నారు. రెండు రాష్ట్రాల్లోను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా నష్టపోయిందని చెప్పారు.
ఇది తగ్గించటేందుకు అవకాశం లేని తీవ్ర నష్టమన్నారు. అలా జరిగి ఉంటే ఎలా ఉండేదో అనే సందేహాలు, అభిప్రాయాలు చాలా ఉన్నాయని, కేసీఆర్‌ను చంద్రబాబు మంత్రివర్గంలోకి తీసుకొని ఉంటే ఎలా ఉండేదోనని, వైయస్సార్ మరణించకుండా ఉంటే పరిస్థితులు వేరుగా ఉండేవేమోననే అభిప్రాయాలు, వైయస్ మరణం కేసీఆర్‌కు జీవం పోసింది.. అనే ఎన్నో అభిప్రాయాలున్నాయన్నారు.












Click it and Unblock the Notifications