సత్తెనపల్లిలో సంబరాలు ఎవరివి - బిగ్ టర్న్..!!
ఏపీలో పలు నియోజకవర్గాల్లో హోరా హోరీ పోరు సాగింది. ఎవరు గెలుస్తారనే ఉత్కంఠ పెరుగుతోంది. కౌంటింగ్ ముందే లెక్కలు వేసుకొని ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ, టీడీపీ నుంచి ఇద్దరు సీనియర్లు తలపడుతున్న సత్తెనపల్లి ఫలితం పైన భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఇద్దరు అభ్యర్దుల మద్దతుదారులు తమదే విజయమని చెబుతున్నారు. అయితే, స్థానిక లెక్కలు కీలకంగా మారాయి. ఇంతకీ సత్తెనపల్లిలో గెలిచేదెవరు. సంబరాలు చేసుకొనేదెవరు.
హోరా హోరీ పోరు
సత్తెనపల్లిలో వైసీపీ నుంచి మంత్రి అంబటి రాంబాబు పోటీ చేయగా.. తెలుగుదేశం నుంచి మాజీమంత్రి కన్నా లక్ష్మీనారాయణ బరిలో ఉన్నారు. ఇద్దరూ కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలే కావటం సహా వాగ్దాటిలో కానీ.. రాజకీయాల్లోనూ ఇద్దరూ ఇద్దరే. నియోజకవర్గానికి మాత్రం ఇద్దరూ స్థానికేతరులే. 2014లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం తరఫున కోడెల శివప్రసాదరావు నరసరావుపేట నుంచి వచ్చి వైసీపీ అభ్యర్ధి అంబటి రాంబాబుపై 924 ఓట్ల నామమాత్రపు మెజారిటీతో గెలిచారు. 2019లో అంబటి రాంబాబు.. కోడెలను 20 వేలకు పైగా మెజారిటీతో ఓడించి ప్రతీకారం తీర్చుకున్నారు.

ఎవరి లెక్కలు వారివే
సత్తెనపల్లిలో ఎవరు గెలిస్తే.. ఆ పార్టీ అధికారంలోకి వస్తుందనేది రాజకీయపార్టీలో బలమైన విశ్వాసం. అక్కడ గెలుపు కోసం సర్వశక్తులూ ఒడ్డుతుంటారు. ప్రస్తుతం నియోజకవర్గంలో వైసీపీ నుంచి అంబటి రాంబాబు గెలిచినా.. టీడీపీ నుంచి కన్నా లక్ష్మీనారాయణ గెలిచినా.. రాష్ట్ర క్యాబినెట్‌లో స్థానం ఖాయమనే చర్చ సాగుతోంది. దీంతో గట్టి పోటీనే ఇద్దరూ ఎదుర్కొన్నారనే వాదన ఉంది. తమదే విజయమని టీడీపీ చెబుతుండగా..ప్రభుత్వ పథకాలు తప్పకుండా తమను గెలిపిస్తాయనే భావనలో అధికార వైసీపీ ఉంది. కన్నా పోటీ చేయటంతో.. జనసేన, బీజేపీ పార్టీల ఓట్లు ఆయనకు కలిసొచ్చే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.
విజం పై ఉత్కంఠ
కూటమిలో కొన్ని విభేదాలున్నా.. వాటిని పరిష్కరించుకోవడంలో లక్ష్మీనారాయణ సక్సెస్ అయ్యారనే వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. అంబటి రాంబాబుకి కూడా అనేక ప్రతికూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. అంబటి రాంబాబుకి కీలకమైన ముస్లిం, రెడ్డి సామాజికవర్గంతో పాటు కాపు సామాజకవర్గ ఓట్లు కలసి వస్తాయనే ధీమాలో వైసీపీ ఉంది. పథకాలను అందుకున్న మహిళలంతా తమవైపే ఉన్నారని వైసీపీ భావిస్తోంది. ప్రభుత్వ పథకాల వైపు జనాలు ఆకర్షితులైతే.. అంబటికి భారీ మెజార్టీ ఖాయమనే భావనలో వైసీపీ అధిష్టానం ఉంది. హోరాహోరీగా జరిగిన ఎన్నికల్లో విజయం ఇరువైపులా దోబూచులాడే అవకాశం ఉన్న నేపథ్యంలో గెలుపు ఎవరిని వరిస్తుందనేది ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications