పవన్ కు బిగ్ రిలీఫ్.. ! ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు..!
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఇవాళ భారీ ఊరట లభించింది. తాను సినిమాల్లో ఉన్నా, రాజకీయాల్లో ఉన్నా తన వ్యక్తిగత హక్కుల గోప్యత విషయంలో జరుగుతున్న ఉల్లంఘనలపై ఆయన ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. సోషల్ మీడియాలో తన వ్యక్తిగత హక్కుల ఉల్లంఘన జరుగుతోందని ఆరోపిస్తూ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు ఇవాళ కీలక ఆదేశాలు ఇచ్చింది.
పవన్ కళ్యాణ్ తన పిటిషన్ లో తన అనుమతి లేకుండా పేరు, చిత్రం, గొంతు, వ్యక్తిత్వానికి సంబంధించిన అంశాల్ని వాణిజ్య ప్రయోజనాల కోసం వాడుకోకుండా అడ్డుకోవాలని ఢిల్లీ హైకోర్టును కోరారు. ప్రస్తుతం కీలక రాజ్యాంగ పదవిలో ఉన్న తన వ్యక్తిత్వానికి భంగం వాటిల్లడం వల్ల తన ప్రజా జీవితంపై ప్రభావం పడుతుందని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. దీనిపై జస్టిస్ మన్మీత్ ప్రీతం సింగ్ అరోరా నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. పవన్ వ్యక్తిగత హక్కుల ఉల్లంఘనపై వివరాలు తీసుకుంది. అనంతరం దర్యాప్తు సంస్థలకు ఆదేశాలు ఇచ్చింది.

2021 ఐటీ నిబంధనల ప్రకారం పవన్ కళ్యాణ్ కు సంబంధించి సోషల్ మీడియాలో పెట్టిన అభ్యంతరకర ఫొటోలు, వీడియోలపై చర్యలు తీసుకోవాలని ఢిల్లీ హైకోర్టు.. దర్యాప్తు సంస్థల్ని ఆదేశించింది. ఈ మేరకు సంబంధిత సోషల్ మీడియా సంస్థలు, ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లకు సైతం నోటీసులు జారీ చేసింది. పవన్ కళ్యాణ్ ప్రమేయం లేకుండా ఆయన ఇమేజ్‌ను వాడుతున్న లింకులను తొలగించాలని కూడా ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఈ విషయంలో పవన్ కు ఊరట దక్కినట్లయింది. గతంలో అమితాబ్ బచ్చన్ తో పాటు ఐశ్వర్యారాయ్, రజనీకాంత్, జూనియర్ ఎన్టీఆర్ కూడా ఇలాంటి ఆదేశాలే తెచ్చుకున్నారు.












Click it and Unblock the Notifications