ఏపీలో టోల్ గేట్ల నుంచి ఊరట- కేంద్రం ఉత్తర్వులతో భారీగా తగ్గింపు-ఎక్కడెక్కడంటే ?
దేశవ్యాప్తంగా గతంలో విచ్చలవిడిగా కాంట్రాక్టర్లకు మంజూరు చేసిన టోల్ ప్లాజాల విషయంలో కేంద్రం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. 60 కిలోమీటర్ల దూరంలో ఒకటికి మించి టోల్ ప్లాజాలు ఉండకూడదన్న నిబంధన ఉన్నా దాన్ని ఉల్లంఘించి మరీ 20 కిలోమీటర్ల దూరంలోనూ టోల్ ప్లాజాలు ఇచ్చేశారు. దీంతో జాతీయ రహదారులపై విచ్చలవిడి దోపిడీ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో కేంద్రం తాజాగా ఈ నిర్ణయాన్ని సమీక్షించి కొత్త విధానం ప్రకటించింది.

60 కిలోమీటర్ల టోల్ నిబంధన
దేశంలోని జాతీయ రహాదారుల్ని నిర్మించే కాంట్రాక్టర్లకు వాటికి అయ్యే మొత్తాన్ని తిరిగి వసూలు చేసుకునేందుకు వీలుగా కేంద్రం గతంలో 60 కిలోమీటర్లలో టోల్ ప్లాజాను మంజూరు చేసింది. ఆ తర్వాత కాంట్రాక్టర్ల ఒత్తిడితో 60 కిలోమీటర్ల దూరం లేకపోయినా కొత్త టోల్ ప్లాజాలకు అనుమతి ఇచ్చేసింది. ఈ టోల్ ప్లాజాను దాటి వెళ్లే ఆటోలు, కార్లు, బస్సులు, లారీలు, ఇతర భారీ వాహనాలకు ఇప్పటివరకూ టోల్ వసూలు చేస్తున్నారు. దీంతో జనం జేబులకు చిల్లు పడుతోంది. దీనిపై విమర్శలు వెల్లువెత్తడంతో కేంద్రం తాజాగా తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది.

గడ్కరీ కీలక ప్రకటన
దేశంలో 60 కిలోమీటర్ల దూరంలో ఒకటి కంటే ఎక్కువ టోల్ ప్లాజాలు ఉండరాదని కేంద్రం తాజాగా నిర్ణయించింది. ఈ మేరకు గతంలో తయారు చేసిన నిబంధనను కచ్చితంగా అమలు చేయాలని నిర్ణయించింది. ఆ మేరకు దేశంలో 60 కిలోమీటర్ల దూరంలో జాతీయ రహదారులపై ఉన్న ఒకటి కంటే ఎక్కువ టోల్ ప్లాజాను తొలగిస్తామని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. దీంతో గడ్కరీ ప్రకటన దేశవ్యాప్తంగా జాతీయ రహాదారులపై ప్రయాణించే లక్షలాది వాహనదారులకు ఊరటనిచ్చింది.

ఏపీలో 15 టోల్ గేట్ల తొలగింపు
కేంద్రం అమలు చేస్తున్న 60 కిలోమీటర్ల నిబంధన వల్ల ఏపీలో ప్రస్తుతం ఉన్న టోల్ ప్లాజాల్లో 15 తొలగించే అవకాశమున్నట్లు అంచనా వేస్తున్నారు. ఇవన్నీ 60 కిలోమీటర్ల మధ్యన ఒకటి కంటే ఎక్కువగా ఉన్నవే. కొన్నయితే 20 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నాయి. వీటిని తప్పనిసరిగా తొలగించాల్సిన పరిస్ధితి ఏర్పడింది. ఏపీ నుంచి తమిళనాడుకు వెళ్లే జాతీయ రహదారిపై ఇలాంటివి ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. వీటన్నింటినీ త్వరలో తొలగించేందుకు అధికారిక ఉత్తర్వులు వెలువడాల్సి ఉంది.

కోస్తా జిల్లాల్లో తొలగించే టోల్ ప్లాజాలివే
కోల్ కతా-చెన్నై జాతీయ రహదారి నంబర్ 16పై మొత్తం ఇలాంటి టోల్ ప్లాజాలు ఏడు ఉన్నాయి. వీటిలో ఇచ్ఛాపురం-రణస్ధలం మధ్య మరపాం, చిలకపాలెం ప్రాంతాల్లో 27 కిలోమీటర్ల దూరంలోనే రెండు ఉన్నాయి. వీటిలో ఒకటి తీసేయడం ఖాయం. అలాగే రణస్ధలం-ఆనందపురం మధ్య 40 కిలోమీటర్ల దూరంలోనే చిలకపాలెం, నాతవలస టోల్ ప్లాజాలు ఉన్నాయి. వీటిలో ఒకటి రద్దవుతుంది. అలాగే ఆనందపురం-అనకాపల్లి మధ్య 30 కిలోమీటర్ల దూరంలోనే నాతపలస-దుక్కవానిపాలెం టోల్ ప్లాజాలున్నాయి. వీటిలో ఒకటి తొలగిస్తారు. అలాగే గుంగుగొలను-విజయవాడ మధ్య 21 కిలోమీటర్ల దూరంలోనే పొట్టిపాటి, కలపర్రు టోల్ ప్లాజాలున్నాయి. వీటిలో ఒకటి తొలగింపు ఖాయం. నెల్లూరు జిల్లాలో 31 కిలోమీటర్ల దూరంలో వెంకటాచలం, బూద్నం మధ్య రెండు టోల్ ప్లాజాల్లో ఒకటి తొలగిస్తారు. ఇదే జిల్లా బూద్నాం-సూళ్లూరు పేట వద్ద ఉన్న 31 కిలోమీటర్ల దూరంలోనే ఉన్న రెండు టోల్ ప్లాజాల్లో ఒకటి తొలగింపు ఖాయం.
అలాగే జాతీయ రహదారి 216 మీద రాజమండ్రి-గుండుగొలను మధ్య ఈతకోట,ఉంగుటూరు టోల్ ప్లాజాల్లో ఒకటి తొలగింపు ఖాయం.

రాయలసీమలో తొలగించే టోల్ ప్లాజాలివే
40వ నంబర్ జాతీయ రహదారిపై పీలేరు-కడప మధ్య దురంవానిపల్లి, బండపల్లి మధ్య 51 కిలోమీటర్ల దూరంలో ఉన్న రెండు టోల్ ప్లాజాల్లో ఒకటి తీసేస్తారు. ఇదే పీలేరు-కడప మధ్య 46 కిలోమీటర్ల దూరంలో ఉన్న బండపల్లి, పాలెంపల్లి టోల్ ప్లాజాల్లో ఒకటి తొలగింపు ఖాయం. 42వ నంబర్ జాతీయ రహదారిపై అనంతపురం-మదనపల్లి మధ్య 57 కిలోమీటర్ల దూరంలో జెళ్లిపల్లి, బత్తలపల్లి మధ్య ఉన్న రెండు టోల్ ప్లాజాల్లో ఒకటి తొలగిస్తారు. విజయవాడ-కోడాద మధ్య 65వ నంబర్ జాతీయ రహదారిపై ఉన్న కీసర, చిల్లకల్లు టోల్ ప్లాజాల్లో ఒకటి తీసేస్తారు.












Click it and Unblock the Notifications