ఏపీలో వడగాల్పుల నుంచి ఊరట-పలు జిల్లాల్లో వర్షాలు-చల్లబడిన వాతావరణం
ఏపీలో వడగాల్పుల తీవ్రత కొనసాగుతున్న నేపథ్యంలో నిన్న అర్ధరాత్రి నుంచి వర్షాలు మొదలయ్యాయి.ఆకస్మికంగా పలుచోట్ల కురిసిన వర్షంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. పలు జిల్లాల్లో కురుస్తున్న వర్షాలతో జనానికి భారీ ఊరట కలుగుతోంది.
ఏపీలోని పలు జిల్లాల్లో అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఎన్టీఆర్ జిల్లా మైలవరం, రెడ్డిగూడెం, జి.కొండూరు మండల్లాలో భారీ వర్షం కురిసింది. ఇక ఉమ్మడి విశాఖ జిల్లాలో రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తోంది. అనకాపల్లి, చోడవరం, వడ్డాది, మాడుగుల, చీడికాడ.., విశాఖపట్నంలోని పెందుర్తి ప్రాంతంలో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతోంది. భారీ వర్షం వల్ల పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. భారీ వర్షం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా మరో ఐదు రోజుల పాటు వడగాల్పులు తప్పవని వాతావరణ విభాగం ప్రకటించిన 24 గంటల్లోనే ఈ ఆకస్మిక వర్షాలు కురుస్తుండటం విశేషం. వడగాల్పుల తీవ్రత కారణంగా జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాత్రి వేళల్లో కూడా ఉక్కపోత పెరుగుతోంది. దీంతో విద్యుత్ వాడకం కూడా అంతకంతకూ పెరుగుతోంది. ఇలాంటి సమయంలో ఆకస్మికంగా కురుస్తున్న వర్షాలతో జనానికి ఊరట దక్కుతోంది. అలాగే విద్యుత్ వాడకం కూడా భారీగా తగ్గింది. నైరుతి రుతుపవనాలు జూన్ 1 కల్లా రాష్ట్రాన్ని తాకే అవకాశం ఉందని భావిస్తున్న తరుణంలో ఈ ఆకస్మిక వర్షాలు సహజమేనని వాతావరణ అధికారులు చెప్తున్నారు.












Click it and Unblock the Notifications