Vidadala Rajini: విడదల రజనీకి హైకోర్టులో భారీ ఊరట..!
ఏపీలో గత వైసీపీ ప్రభుత్వంలో తొలిసారి ఎమ్మెల్యే అయి మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహించిన విడదల రజనీకి కూటమి ప్రభుత్వంలో మాత్రం చిక్కులు తప్పడం లేదు. ముఖ్యంగా తాను మంత్రిగా ఉన్న సమయంలో డబ్బుల కోసం బెదిరింపులకు దిగిన ఓ ఘటనలో ఏసీబీ నమోదు చేసిన కేసును రజనీ ఎదుర్కొంటున్నారు. ఇదే కేసులో ఏసీబీ తాజాగా ఆమె మరిది గోపీనాథ్ ను అరెస్టు చేసింది. దీంతో రజనీ అరెస్టు కూడా ఖాయం అనుకుంటున్న సమయంలో ఆమెకు ఊరట లభించింది.
వైసీపీ హయాంలో ఉమ్మడి గుంటూరు జిల్లాలో శ్రీలక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ యజమానాన్ని డబ్పుల కోసం బెదిరించిన వ్యవహారంలో విడదల రజనీతో పాటు ఆమె మరిది గోపీనాథ్ పై ఏసీబీ గతంలో కేసు నమోదు చేసింది. ఈ కేసులో రజనీతో పాటు పలువురిని నిందితులుగా చేర్చింది. తాజాగా ఇదే కేసులో మరిది గోపీనాథ్ అరెస్టు కావడంతో రజనీ అలర్ట్ అయ్యారు. హైకోర్టులో ముందస్తు బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు.

ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టులో మాజీ మంత్రి విడదల రజిని దాఖలు చేసిన పిటిషన్ పై ఆమె తరుపున మాజీ అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలు వినిపించారు. దీనిపై ప్రభుత్వం కూడా వాదనలు వినిపించింది. చివరికి ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు.. విడదల రజనీకి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఆమెకు 41-ఎ నోటీసులు ఇచ్చి ప్రశ్నించాలని ఏసీబీకి ఆదేశాలు ఇచ్చింది.
అంతేకాదు ఏసీబీ విచారణకు సహకరించాలని రజినీకి కోర్టు ఆదేశాలు ఇచ్చింది. అలాగే ఈ కేసుకు సంబంధించి బహిరంగ వ్యాఖ్యలు చేయొద్దని విడదల రజనీని హైకోర్టు ఆదేశించింది. మరోవైపు ఇదే కేసులో రజినీ పీఏ రామకృష్ణకూ 41-ఎ నోటీసులు ఇచ్చి విచారించాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది.












Click it and Unblock the Notifications