AP Women Police : ఏపీలో మహిళా పోలీసులకు డీజీపీ గుడ్ న్యూస్-ఎస్పీలకు ఆదేశాలు జారీ..!
ఏపీలో మహిళా పోలీసులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మహిళా పోలీసుల విధుల విషయంలో ఎదురవుతున్న విమర్శలకు చెక్ పెడుతూ డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి ఈ మేరకు ఆదేశాలు జారీ చేసారు. జిల్లా ఎస్పీలు ఇకపై వారి విషయంలో వ్యవహరించాల్సిన తీరును డీజీపీ ఆదేశాల్లో పేర్కొన్నారు. తాజా ఉత్తర్వులతో మహిళా పోలీసులకు ఆ మేరకు ఊరట దక్కుతుందని భావిస్తున్నారు.
ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్ధలు ఏర్పాటు చేశారు. అందులో మహిళా సంక్షేమ కార్యదర్శుల్ని నియమించారు. వీరు తమ సచివాలయ పరిధిలోకి వచ్చే మహిళల సమస్యలపై వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే అనంతర కాలంలో ప్రభుత్వం వారిని మహిళా పోలీసుల సేవలకు వాడుకోవాలని నిర్ణయించింది. అంతే కాదు వారికి పోలీసు యూనిఫామ్స్ కూడా ఇచ్చేసింది. దీనిపై హైకోర్టులో పిటిషన్లు దాఖలు కావడంతో న్యాయస్ధానం ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో ప్రభుత్వం యూటర్న్ తీసుకుంది.

ఇప్పటివరకూ మహిళా పోలీసులుగా పిలుస్తున్న మహిళా సంక్షేమ కార్యదర్శుల్ని ఇకపై పోలీసు విధులు కేటాయించరాదని నిర్ణయించింది. ఈ మేరకు డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి ఇవాళ జిల్లా ఎస్పీలకు ఆదేశాలు జారీ చేశారు. ఇందులో గ్రామాల్లోని మహిళలు, చిన్నారులు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించేందుకు ఇతర శాఖలతో సమన్వయ పరుచుకుని వారికి కావల్సిన పూర్తి సహాయసహకారాలు అందించడం మహిళా పోలీస్ ఏర్పాటు యొక్క ముఖ్య ఉద్దేశమన్నారు.

గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న మహిళ పోలీస్ ను పోలీస్ శాఖలోని సాధారణ విధులైన బందోబస్తు, రిసెప్షన్ మరియు శాంతి భద్రతల వంటి వాటికి వినియోగించడం, తరచుగా పోలీస్ స్టేషన్ కు పిలిపించడం వంటివి ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదని పోలీస్ కమిషనర్లు, రేంజ్ డీఐజీలు, జిల్లా ఎస్పీలకు డిజిపి రాజేంద్రనాథ్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఎవరైనా అందుకు విరుద్ధంగా మహిళా పోలీస్ ను పోలీస్ విధులకు వినియోగించినట్లయితే వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications