పిన్నెల్లికి హైకోర్టులో భారీ ఊరట-మరో మూడు కేసుల్లోనూ బెయిల్..!
ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సందర్భంగా మాచర్లలోని పాల్వాయి గేట్ పోలింగ్ కేంద్రంలో ఈవీఎం ధ్వంసం చేసిన ఘటనలో హైకోర్టు నుంచి ముందస్తు బెయిల్ పొందిన వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై అనంతరం మరో మూడు కేసులు నమోదయ్యాయి. వీటిలో హత్యాయత్నంతో పాటు దాడుల కేసులు ఉన్నాయి. దీంతో వీటిలో అరెస్టు ముప్పు ఉందన్న కారణంతో ఆయన ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు.
దీనిపై ఇవాళ విచారణ జరిపిన హైకోర్టు ఆయనపై దాఖలైన మూడు కేసుల్లోనూ ముందస్తు బెయిల్ ఇస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. పోలింగ్ రోజు మాచర్లలో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనల్లో పిన్నెల్లి పాత్రపై పోలీసులు పక్కా ఆధారాలు సేకరించి మూడు కేసులు నమోదు చేశారు. దీంతో ఆయన్ను అరెస్టు చేసేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. ఇప్పటికే ఈవీఎం ధ్వంసం కేసులో బెయిల్ పొందిన పిన్నెల్లిని ఈ మూడు కేసుల్లో అరెస్టు చేస్తే కౌంటింగ్ సమయంలో ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉండటంతో హైకోర్టును బెయిల్ కోరారు.

దీనిపై నిన్న వాదనలు పూర్తి చేసిన హైకోర్టు.. ఇవాళ్టికి తీర్పు రిజర్వు చేసింది. కొద్ది సేపటి క్రితం పిన్నెల్లిపై దాఖలైన మూడు కేసుల్లోనూ ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు వెలువరించింది. దీంతో కౌంటింగ్ వేళ ఆయనకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పోయింది. ఇప్పటికే అరెస్టు భయంతో మాచర్ల బయట ఉంటున్న ఆయన తిరిగి స్వస్థలానికి తిరిగి వచ్చేందుకు వీలు దొరికినట్లయింది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఆయన రేపోమాపో తిరిగి మాచర్లకు రానున్నారు.












Click it and Unblock the Notifications