జగన్ సర్కార్ కు హైకోర్టు బిగ్ షాక్-విద్యాదీవెన జీవోల రద్దు-ఫీజులు తల్లులకు కాదు కాలేజీలకు !
ఏపీలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ప్రారంభమైన ఫీజు రీయింబర్స్ మెంట్ పథకాన్ని పూర్తిగా మార్చి కాలేజీల ఖాతాల్లోకి వెళ్లే ఫీజుల్ని కాస్తా తల్లుల ఖాతాలకు మార్చింది వైసీపీ సర్కార్. దీనికి జగనన్న విద్యా దీవెన పథకంగా పేరు పెట్టి అమలు చేస్తోంది. అయితే తాజాగా హైకోర్టు ఈ పథకానికి భారీ షాకిచ్చింది. ఫీజులు కాలేజీల ఖాతాల్లోకి వెళితే పిల్లలకు చదువులు వస్తాయి కానీ తల్లుల ఖాతాల్లో వేస్తే ఏం ప్రయోజనమని ప్రశ్నించిన హైకోర్టు.. దీనిపై ఇచ్చిన జీవోల్ని రద్దు చేసేసింది. అంతేకాదు గతంలో ఇచ్చిన మొత్తాలు కాలేజీలకు చేరాయో లేదో విచారణ చేపట్టాలని ఆదేశాలు ఇచ్చింది.

వైఎస్ ఫీజు రీయింబర్స్ మెంట్
గతంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఫీజు రీయింబర్స్ మెంట్ పథకాన్ని తొలిసారిగా తెరపైకి తెచ్చారు. దీని ప్రకారం కాలేజీలకు వెళ్లే పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్ధుల తరఫున వారి ఫీజుల్ని ప్రభుత్వమే కాలేజీల ఖాతాల్లో జమ చేస్తుంది. దీని వల్ల ఆయా కాలేజీల నుంచి వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చదువు కొనసాగించడానికి వీలు కలుగుతుంది. వారికి ఫీజులు కట్టలేక మధ్యలో చదువు ఆపేయాల్సిన అగత్యం తప్పుతుంది. వైఎస్ హయాంలో పకడ్బందీగా అమలైన ఈ పథకం ఆయనకు ఎంతో పేరు తెచ్చిపెట్టింది. వైఎస్ తర్వాత అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రులు, రాష్ట్ర విభజన తర్వాత ఏపీ, తెలంగాణలోనూ వాటిని ఇప్పటికీ అమలు చేస్తున్నాయి. అయితే ఏపీలో వైసీపీ సర్కార్ మాత్రం దీని రూపురేఖలు మార్చేసింది.

జగనన్న విద్యాదీవెనగా మార్పు
జగన్ సర్కార్ అధికారంలోకి రాగానే ఫీజు రీయింబర్స్ మెంట్ పథకం కాస్తా జగనన్న విద్యా దీవెనగా మారిపోయింది. వైఎస్ హయాం నుంచి కూడా ఉన్న రీయింబర్స్ మెంట్ స్కీం ను జగన్ తన పేరుతో మార్చుకుని విద్యాదీవెనగా అమలు చేస్తున్నారు. అయితే పేరు మారితే పర్వలేదు. ఈ పథకం విధివిధానాలన్నీ మారిపోయాయి. దీంతో ఈ వ్యవహారం కోర్టులకెక్కింది. ప్రస్తుతం ప్రభుత్వం తాజా విధివిధానాల ప్రకారం ఈ పథకంలో భాగంగా కాలేజీల ఫీజుల్ని కాలేజీల ఖాతాల్లో కాకుండా విద్యార్ధుల తల్లితండ్రుల ఖాతాల్లో జమ చేస్తుంది. దీనిపైనే ప్రధానంగా అభ్యంతరాలు మొదలయ్యాయి. దీంతో జోక్యం చేసుకున్న హైకోర్టు.. కీలక ఆదేశాలు ఇచ్చింది.

తల్లుల ఖాతాల్లో ఫీజుల వృథా
పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్ధులు కాలేజీలకు చెల్లించాల్సిన వేల కొద్దీ ఫీజుల్ని వైసీపీ ప్రభుత్వం తల్లుల ఖాతాల్లో ఏటా విద్యాదీవెన రూపంలో జమ చేస్తోంది. అయితే ఈ ఫీజులు తిరిగి సకాలంలో కాలేజీలకు చేరుతున్నాయా అంటే అదీ లేదు. ఇప్పటివరకూ విద్యాదీవెన రూపంలో ఫీజులు అకౌంట్లో వేయించుకున్న తల్లుల్లో కేవలం 60 శాతం మంది మాత్రమే వాటిని తిరిగి కాలేజీలకు చెల్లించారు. మిగతా వారు మాత్రం ఇప్పటికీ చెల్లించడం లేదు. దీంతో కాలేజీలు లబోదిబోమంటున్నాయి. ప్రభుత్వాన్ని ప్రశ్నించినా పట్టించుకునే పరిస్ధితి లేకపోవడంతో శ్రీకృష్ణదేవరాయ యూనివర్శిటీ పరిధిలోని ప్రైవేటు కాలేజీలు హైకోర్టును ఆశ్రయించాయి.
Recommended Video

విద్యాదీవెనపై హైకోర్టు షాక్
విద్యాదీవెన పథకంలో భాగంగా ప్రభుత్వం విద్యార్ధుల తల్లులకు చెల్లిస్తున్న ఫీజుల మొత్తాలు తిరిగి కాలేజీలకు రావడం లేదనే పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు ప్రభుత్వానికి భారీ షాకిచ్చింది. ప్రభుత్వం తల్లులకు ఇస్తున్న ఫీజులు తిరిగి కాలేజీలకు చేరకపోతే ఏం ప్రయోజనమని ప్రభుత్వాన్ని నిలదీసింది. గతంలో కాలేజీలకు ఫీజులు ఇచ్చినప్పటి కంటే పరిస్ధితులు ఏమైనా మారాయా అంటే అదీ లేదు. దీంతో విద్యాదీవెన కింద ఇస్తున్న ఫీజులు వృథా అవుతున్నట్లు గుర్తించిన హైకోర్టు దీనిపై గతంలో జారీ చేసిన జీవోల్ని రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఓ కీలక పథకంపై హైకోర్టులో భారీ ఎదురుదెబ్బ తగిలినట్లయింది.

ఇక ఫీజులు కాలేజీలకే
ఇప్పటివరకూ విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో జమ చేస్తున్న ఫీజుల్ని ఇకపై గతంలోలాగే కాలేజీల ఖాతాల్లో జమ చేయాలని హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఫీజు రీయింబర్స్ మెంట్ పథకం తరహాలోనే కాలేజీల ఖాతాల్లోకి ఈ ఫీజులు వెళితేనే విద్యార్ధులు ఇబ్బందుల్లేకుండా చదువు కొనసాగించుకునే అవకాశం దొరుకుతుందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ప్రభుత్వం ఇప్పుడు తప్పనిసరిగా విద్యాదీవెన పథకంలో మార్పులు చేయాల్సిన పరిస్దితి తలెత్తింది. సవరించిన ఆదేశాలతో తిరిగి కాలేజీల ఖాతాల్లో ఫీజులు వెళ్లేలా జీవోలు ఇవ్వాలని హైకోర్టు తన తీర్పులో తెలిపింది. దీనిపై వైసీపీ సర్కార్ ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సి ఉంది.

తల్లుల నుంచి ఫీజుల వసూల్ ?
గతంలో విద్యాదీవెన పథకం ద్వారా ప్రభుత్వం నుంచి ఫీజులు తీసుకన్న తల్లులు వాటిని కాలేజీలకు సక్రమంగా చెల్లించలేదు ఇలా చెల్లించకుండా ఉండిపోయిన వారి శాతం 40గా ఉంది. దీంతో హైకోర్టు ఈ విషయాన్ని కూడా సీరియస్ గా పరిగణించింది. ఈ 40 శాతం మంది నుంచి ఫీజుల్ని వసూలు చేసి కాలేజీలకు అందేలా చూడాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కాలేజీలు నేరుగా విద్యార్ధుల నుంచి ఫీజులు వసూలు చేసుకునే అధికారం ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ప్రభుత్వం ఇప్పుడు ఈ 40 శాతం మంది తల్లుల నుంచి ఫీజుల్ని వెనక్కి తీసుకోవడం లేదా కాలేజీలకు అందేలా చూసేందుకు సిద్ధమవుతోంది.
-
ఏపీలో ఆ ప్రాంతానికి పులి, స్థానికుల భయం.. రంగంలోకి హనుమాన్ బృందాలు! -
రేషన్ లబ్దిదారుల కోసం ప్రభుత్వం ఊహించని నిర్ణయం, ఇక నేరుగా..!! -
హైదరాబాద్ ను మించి అమరావతి నిర్మాణం చేస్తామన్న సీఎం చంద్రబాబు! -
ఏపీలోని ఆ గ్రామంలో పిడకల సమరం.. చూస్తే మీరే షాక్ అవుతారు! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్











Click it and Unblock the Notifications