ఫ్లెక్సీల నిషేధంపై జగన్ సర్కార్ కు ఎదురుదెబ్బ-హైకోర్టు కీలక ఆదేశాలు..!
ఏపీలో పర్యావరణానికి ముప్పుగా పరిణమిస్తున్న ప్లాస్టిక్ ఫ్లెక్సీలపై గతంలో జగన్ సర్కార్ విధించిన నిషేధాన్ని హైకోర్టు ఇవాళ ఎత్తేసింది.
అమరావతి : ఏపీలో ప్లాస్టిక్ ఫ్లెక్సీలపై నిషేధం విషయంలో హైకోర్టు ఇవాళ కీలక ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఫ్లెక్సీలపై నిషేధం విధిస్తూ జారీ చేసిన ఆదేశాలను హైకోర్టు తోసిపుచ్చింది. దీంతో ఆయా ఫ్లెక్సీలపై విధించిన నిషేధం తొలగిపోయినట్లయింది.
రాష్ట్రంలో ప్లాస్టిక్ ఫ్లెక్సీల వాడకాన్ని పూర్తిగా నిషేధిస్తూ గతేడాది వైసీపీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జీవో కూడా విడుదల చేసింది. అయితే వాటి తయారీదారుల అభ్యంతరాలతో నిర్ణయాన్ని వాయిదా వేసింది. తిరిగి ఈ ఏడాది జనవరి 26 నుంచి ఫ్లెక్సీలపై నిషేధం విధించేందుకు సిద్ధమైంది. ఆలోపే ఫ్లెక్సీల తయారీదారులు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో విచారణ జరిపిన హైకోర్టు.. ఇవాళ నిషేధాన్ని తొలగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇందులో ఓ మెలిక పెట్టింది.

సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఫ్లెక్సీలకు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం విధించిన నిషేధం వర్తిస్తుందని హైకోర్టు ఇవాళ ఇచ్చిన ఆదేశాల్లో పేర్కొంది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఓవెన్ , పీవీసీ ఫ్లెక్సీలకు ఈ నిషేదం వర్తించదని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. దీంతో ఫ్లెక్సీ ల పై నిషేదాన్ని సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించిన ఫ్లెక్సీ ఓనవర్స్ అసోసియేషన్ కు భారీ ఊరట దక్కినట్లయింది. ఇవాళ విచారణలో మధ్యంతర ఉత్తర్వులు మాత్రమే జారీ చేసిన హైకోర్టు.. కేసు తదుపరి విచారణను ఫిబ్రవరి 22వ తేదీకి వాయిదా వేసింది.












Click it and Unblock the Notifications