ఆ ఉద్యోగులకు చంద్రబాబు బిగ్ షాక్-రెండు రోజుల్లో రెండో నిర్ణయం..!
ఏపీలో అవినీతి ఉద్యోగులకు సీఎం చంద్రబాబు మరో షాకిచ్చారు. రెండు రోజుల క్రితం వీరిపై చర్యలకు కీలక నిర్ణయం తీసుకున్న చంద్రబాబు.. ఇవాళ మరో నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గత వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రంలో అవినీతి హద్దులు దాటిపోయిందని భావిస్తున్న ప్రభుత్వం.. దాన్ని నియంత్రించాలంటే కఠిన చర్యలు అవసరమని భావిస్తోంది. ఇందులో భాగంగా చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.
రెండు రోజుల క్రితం ప్రభుత్వం రాష్ట్ర విజిలెన్స్ కమిషనర్ గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అనిల్ చంద్ర పునేఠను నియమించారు. తద్వారా విజిలెన్స్ కమిషన్ సమర్ధవంతంగా పనిచేసేలా చేశారు. ఇవాళ దానికి కొనసాగింపుగా అవినీతిపై ఫిర్యాదులు చేసే వారి రక్షణ కోసం మరో నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగుల అవినీతిపై ఫిర్యాదులు చేసే వారికి రక్షణ కల్పించేందుకు నోడల్ అధికారిగా ఇంటెలిజెన్స్ ఛీఫ్ మహేష్ చంద్ర లడ్డాను నోడల్ అధికారిగా నియమించారు.

రాష్ట్రంలో అవినీతికి పాల్పడుతున్న ప్రభుత్వ ఉద్యోగులపై స్వేచ్ఛగా ఫిర్యాదులు చేసేందుకు వీలుగా ఏసీబీతో పాటు విజిలెన్స్ కమిషన్ ను బలోపేతం చేస్తున్న చంద్రబాబు అందులో భాగంగా ఫిర్యాదుదారులకు రక్షణ కల్పించాలని నిర్ణయించారు. దీంతో ఇంటెల్ ఛీఫ్ మహేష్ చంద్ర లడ్డాను వీరికి రక్షణ కల్పించేందుకు నోడల్ అధికారిగా నియమించారు. ఇకపై అవినీతిపై ఫిర్యాదులు చేసే వారు తమకు రక్షణ కావాలంటే ఆయన్ను సంప్రదించాల్సి ఉంటుంది.
ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం ప్రభుత్వ శాఖలతో పాటు కార్పోరేషన్లు, వివిధ ప్రభుత్వ రంగ సంస్థలు, స్థానిక సంస్థలు, ప్రభుత్వ సొసైటీల్లో పనిచేస్తున్న ఉద్యోగులు అవినీతికి పాల్పడితే వారిపై ఫిర్యాదులు చేసే వారికి ఈ నోడల్ అధికారి రక్షణ కల్పిస్తారు . వీరి నుంచి అందే ఫిర్యాదుల ఆధారంగా నోడల్ అధికారి చర్యలు తీసుకుంటారు.












Click it and Unblock the Notifications