గోదావరిలో వారి ఆశలపై నీళ్లు, కొత్త లెక్కలు - అధికారం ఖాయం..!!
ఏపీలో అధికారం దక్కాలంటే గోదావరి జిల్లాలే కీలకం. ఇక్కడ మెజార్టీ సీట్లు సాధించిన వారికే అధికారం దక్కుతుంది. ఇలాంటి గోదావరి జిల్లాలో సమీకరణాలు మారుతున్నాయి. పార్టీల లెక్కల అంచనాలు తప్పుతున్నట్లు కనిపిస్తోంది. పవన్ తో జత కట్టటంతో గోదావరిలో వైసీపీకి స్థానం లేకుండా చేయాలనేది చంద్రబాబు ప్లాన్. సామాజిక సమీకరణాలే అస్త్రంగా పట్టు నిలుపుకోవాలనేది జగన్ వ్యూహం. కానీ, అసలు గోదావరిలో ఏ నియోజకవర్గంలో ఏం జరుగుతోంది. ఓటర్లు ఎటువైపు.
గోదావరిలో కొత్త లెక్కలు
తూర్పు గోదావరిలో19 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. కూటమి నుంచి మూడు పార్టీల అభ్యర్దులు బరిలో ఉన్నారు. వీరి పైన వైసీపీ అభ్యర్దులు గట్టి పోటీ ఇస్తున్నారు. రాజమహేంద్రవరం ఎంపి స్థానానికి వైసిపి నుంచి డాక్టర్ గూడూరు శ్రీనివాస్, టిడిపి కూటమి తరపున బిజెపి రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వరి, కాంగ్రెస్ అభ్యర్థి గిడగు రుద్రరాజు... ప్రధాన ప్రత్యర్థులుగా ఉన్నారు. వీరి ముగ్గురు విజయాకాశాలు అసెంబ్లీ పరిధిలో బలాల పైన ఆధారపడి ఉంది. రాజమహేంద్రవరం సిటీలో టిడిపి అభ్యర్థి ఆదిరెడ్డి వాసు, వైసిపి అభ్యర్థి మార్గాని భరత్ రామ్‌బరిలో ఉన్నారు. వారి మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్టుగా మారింది.రాజమహేంద్రవరం రూరల్‌లో ఎంఎల్‌ఎ గోరంట్ల బుచ్చయ్య చౌదరిపై జనసైనికుల్లో వ్యతిరేకత ఉంది.

ఓట్ల బదిలీ జరిగేనా
జనసేన పార్టీని ఈ స్థానం నుండి పోటీచేయకుండా గోరంట్లే అడ్డుపడ్డారనే అభిప్రాయం వారిలో మెండుగా ఉంది. ఈ పరిస్థితులను వైసిపి అభ్యర్థి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అవకాశంగా మార్చుకున్నారు.
అనపర్తిలో మొన్నటివరకూ టిడిపి నేతగా ఉన్న నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బిజెపి తరపున పోటీచేస్తున్నారు. వైసిపి అభ్యర్థి సత్తిసూర్యనారాయణ రెడ్డి తనదైన శైలిలో ప్రజల్లోకి వెళ్తున్నారు. . చివరి నిముషంలో టికెట్ కోసం బిజెపిలోకి మారారనే విమర్శలు రామకృష్ణారెడ్డి ఎదుర్కొంటున్నారు. రాజానగరంలో జనసేన అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ, వైసిపి అభ్యర్థి జక్కంపూడి రాజామధ్య పోరు జరుగుతోంది. ఇక్కడ ఏ పార్టీ అయినా స్వల్ప మెజారిటీతోనే గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొవ్వూరు నుంచి గోపాలపురం ఎంఎల్‌ఎ తలారి వెంకట్రావు, గోపాలపురం నుంచి కొవ్వూరు ఎంఎల్‌ఎ, మంత్రి తానేటి వనిత పోటీలో ఉన్నారు.
మెజార్టీ సీట్ల పై గురి
కొవ్వూరులో టిడిపి నుంచి మాజీ ఎంఎల్‌ఎ ముప్పిడి వెంకటేశ్వరరావు, కాంగ్రెస్ నుంచి అరిగెల ఆరుణకుమారి ప్రధాన ప్రత్యర్థులుగా ఉన్నారు. ఇక్కడ త్రిముఖ పోరు నెలకొంది. గోపాలపురం నుంచి చంద్రబాబుకు సన్నిహితుడు మద్దిపాటి వెంకటరాజు టిడిపి నుంచి బరిలో ఉన్నారు. ఇక్కడ వనిత, వెంకటరాజు మధ్య ద్విముఖ పోరు నెలకొంది. నిడదవోలులో వైసిపి నుంచి జి. శ్రీనివాసనాయుడు, జనసేన నుండి కందుల దుర్గేష్ పోటీలో ఉన్నారు. మాజీ ఎంఎల్‌ఏ బూరుగుపల్లి శేషారావు టిడిపి టికెట్ ఆశించి భంగపడ్డారు. అయితే ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఆదేశాలతో దుర్గేష్‌కు మద్దతుగా ప్రచారం చేస్తున్నారు. జనసేన గెలుపు టిడిపి సహకారంపైనే ఆధార పడి ఉంది. ఇలా ప్రతీ నియోజకవర్గంలోనూ నువ్వా నేనా అన్నట్లుగా పోరు సాగుతున్న వేళ..ఎన్నికల ఫలితాలు ఉత్కంఠ పెంచుతున్నాయి.












Click it and Unblock the Notifications