జోగి రమేశ్ వాట్సాప్ ఛాట్ లో ట్విస్ట్..! విజయవాడ సీపీ వద్దకు పంచాయితీ..!
ఏపీలో ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో కల్తీ మద్యం తయారీ వ్యవహారం బయటపడిన నేపథ్యంలో ఈ కేసులో నిందితుడు జనార్ధన్ తాను వైసీపీ నేత జోగి రమేశ్ చెప్తేనే ఇదంతా చేశానని ఆరోపించాడు. ఆ తర్వాత వీరిద్దరీ మధ్య సాగినట్లు కనిపిస్తున్న ఓ వాట్సాప్ ఛాట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో అంతా నిజమేనని భావించారు. అక్కడే ట్విస్ట్ చోటు చేసుకుంది. సీన్ కట్ చేస్తే ఇవాళ వైసీపీ నేతలతో కలిసి విజయవాడ సీపీ ఆఫీసులో జోగి రమేశ్ దర్శనమిచ్చారు.
నకిలీ మద్యం కేసులో రిమాండ్‌లో ఉన్న జనార్థన్‌తో తాను చాటింగ్ చేసినట్లు సోషల్ మీడియా, ఎల్లో మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారంపై చర్యలు తీసుకోవాలని కోరుతూ జోగి రమేష్ ఇవాళ విజయవాడ సీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. జనార్థన్ రావుతో తనకు ఎటువంటి సంబంధం లేదని, నకిలీ మద్యం దందాలో కుట్రపూరితంగా తన పేరును వాడుతూ బురదచల్లుతున్నారని జోగి రమేష్ ఈ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిని అడ్డం పెట్టుకుని వైసీపీ ప్రతిష్టను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని, తక్షణం ఈ తప్పుడు ప్రచారాన్ని అరికట్టి, దానికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.

బీసీ నాయకుడైన తనపై కావాలనే ఫేక్ వార్తలను ప్రచారం చేస్తున్నారని జోగి రమేశ్ మండిపడ్డారు. నకిలీ మద్యం దందాలో అరెస్ట్ అయిన జనార్థన్‌ది ఇబ్రహీంపట్నం అయినంత మాత్రాన అతడితో ఈ దందాతో నాకేం సంబంధమని ప్రశ్నించారు. జనార్థన్ వాట్సాప్ చాటింగ్ పేరుతో కొన్ని ఫేక్ సమాచారాన్ని అడ్డం పెట్టుకుని పచ్చ పత్రికలు, మీడియా చానెళ్లు తన ప్రతిష్టను, వైసీపీ ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నం చేస్తున్నాయన్నారు. తన సెల్ ఫోన్‌లను చంద్రబాబు, లోకేష్ లేదా వారు చెప్పే ఏ అధికారికి అయినా ఇవ్వడానికి సిద్దమన్నారు.

తనపై బురదచల్లి, రిమాండ్‌లో ఉన్న జనార్థన్ రావుతో ఒక వీడియో బయటకు పంపి, ఒక ఫేక్ వాట్సాప్ చాటింగ్‌ను ప్రచారం చేయడం చంద్రబాబు చేస్తున్న వికృత రాజకీయ చేష్ట అన్నారు. నకిలీ మద్యంతో తనకు ఎటువంటి సంబంధం లేదని, లైడిటెక్టర్ పరీక్షకు సిద్దమని చెప్పానని, చంద్రబాబు, లోకేష్‌లు తాము చెబుతున్న దానిపై లైడిటెక్టర్ పరీక్షలకు సిద్దమా అని జోగి ప్రశ్నించారు. ముఖ్యమంత్రిగా పరిపాలన చేయడంలో విఫలమైన చంద్రబాబు.. అధికారాన్ని ఉపయోగించి ఒక బలహీనవర్గాలకు చెందిన నాయకుడిపై కుట్రలు చేసే స్థాయికి దిగజారిపోయాడన్నారు. తాను తప్పు చేసి ఉంటే తన వద్దకు రావాలని, దేనికైనా సిద్దమేనని ప్రకటించారు. సిబీఐతో విచారణ జరిపించాలని తానే కోరానన్నారు. నకిలీ మద్యంపై వేసిన సిట్ లోని అధికారులు కూడా చిత్తశుద్దితో దర్యాప్తుచేయాలన్నారు.












Click it and Unblock the Notifications