సీఎం రమేష్‌కు చేదు అనుభవం: అడ్డుకున్న మహిళలు, ఎందుకంటే..?
Recommended Video

కడప: ఇంటింటికీ టీడీపీ పేరుతో చేపట్టిన కార్యక్రమంలో ఎంపీ సీఎం రమేష్‌కు చేదు అనుభవం ఎదురైంది. సిమెంట్ రోడ్డు వేస్తేనే వీధిలో అడుగుపెట్టాలని ఎంపీ సీఎం రమేష్‌కు స్థానిక మహిళలు తేల్చిచెప్పారు. ఈ ఘటన ఘటన కడప జిల్లా చాపాడులో చోటుచేసుకుంది.

చాపాడుకు వెళ్లిన రమేష్
‘ఇంటింటికీ టీడీపీ' కార్యక్రమంలో భాగంగా టీడీపీ నేతలు సభ్యత్వ నమోదు కార్యక్రమంలో బిజీ బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో పలువురు టీడీపీ నేతలతో కలిసి కడప జిల్లా చాపాడుకు సీఎం రమేష్ వెళ్లారు.

అడ్డుకున్న మహిళలు
అక్కడ వీధులన్నింట్లో సభ్యత్వ నమోదు చేసుకుంటూ జెడ్పీ హైస్కూల్ వెనుక వీధిలో అడుగుపెట్టారు సీఎం రమేష్. కాగా, ఆ వీధి వాసులు సీఎం రమేష్‌ను వ్యతిరేకించారు. ప్రధానంగా మహిళలు ఆయనను అడ్డుకున్నారు.

ఆ తర్వాత రండి...
మూడేళ్లుగా సిమెంట్ రోడ్డు వేయమని మొత్తుకుంటున్నా పట్టించుకున్న నాథుడు లేడని వారు మొరపెట్టుకున్నారు. సిమెంట్ రోడ్డు వేశాకే తమ వీధిలోకి రావాలని వారు డిమాండ్ చేశారు. మాటలతో ఉపయోగం లేదని, చేతల్లో చూపించాలని వారు సీఎం రమేష్‌కు స్పష్టం చేశారు.

శాంతించని మహిళలు
కాగా, స్థానిక నాయకత్వంతో కలిసి ఆయన వారికి సర్ది చెప్పే ప్రయత్నం చేసినా మహిళలు శాంతించలేదు. అదే సమయంలో పలువురు సర్పంచ్‌లు స్పెషల్ గ్రాంటు కింద చేసిన పనులకు ఇప్పటికీ బిల్లులు మంజూరు కాలేదని సీఎం రమేశ్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో సమస్యలకు పరిష్కారం చూపిస్తామని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications