నిధులపై బీజేపీవి ఉత్తమాటలేనా: మోడీతో బాబు భేటీ, నివేదికల్లో ఏముంది?
హైదరాబాద్: నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి కోసం ఇప్పటికే రూ. 20 కోట్లు ఇచ్చామని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు సోమవారం వ్యాఖ్యానించారు. దేశంలో విభజించబడిన ఏ రాష్ట్రామూ రాజధాని కోసం ఇంతలా వెంపర్లాడలేదని సంచలన వ్యాఖ్యాలు చేశారు.
గతంలో జార్ఖాండ్, ఉత్తరాఖండ్, ఛత్తీస్‌గఢ్, గుజరాత్.. ఇలా ఎన్నో రాష్ట్రాలు ఏర్పడ్డాయని, వాటిల్లో ఏ రాష్ట్రమూ రాజధాని కోసం ఇంతలా వెంపర్లాడలేదంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఏపీలో సంచలాన్ని సృష్టించాయి. ముఖ్యంగా ఏపీ ప్రభుత్వంపై సోము వీర్రాజు ఒంటి కాలిపై లేస్తున్నారు.
ఏపీ రాజధాని కోసం మాత్రం లక్షల కోట్ల రూపాయలు అడగడం విడ్డూరంగా ఉందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేతలు కూడా తీవ్రస్థాయిలోనే స్పందించారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి అందిన నిధులు బీజేపీ నేతలు చెబుతున్నట్టు ఏపీకి చేసిన అదనపు సాయం కాదని, 14వ ఆర్ధిక సంఘం సిఫారసుల మేరకు రాష్ట్రానికి వచ్చే నిధులేనని అంటున్నారు.

కేంద్రం ఏపీకి భారీగా నిధులు ఇచ్చిందని బీజేపీ నేతలు చెబుతున్న తరుణంలో సీఎం చంద్రబాబు ఆ నిధుల వివరాలతో కూడిన ఓ నివేదికను రూపొందించి దానిని ప్రధాని మోడీకి ఈరోజు అందజేశారు. 'ఇలా చేయడం బీజేపీపై మోడీ వద్ద పంచాయితీ పెట్టడం కాదు. బిజెపి రాష్ట్ర నాయకులు చేస్తున్న దుష్ప్రచారాన్ని ప్రధాని దృష్టిలో పెట్టడం మాత్రమే' అని టీడీపీ అధికార వర్గాల సమాచారం.
2014-15లో 35 వేల కోట్లు, 2015-16లో 43,467 కోట్ల నిధులు అందిన మాట వాస్తవమేనని ఏపీ ప్రభుత్వ నివేదిక చెబుతోంది. అయితే ఇదేమీ ప్రత్యేకంగా చేసిన సాయం కాదు.. 14వ ఆర్ధిక సంఘం సిఫారసుల ప్రకారం అన్ని రాష్ట్రాలతో సమానంగా జనాభా నిష్పత్తి ప్రకారం వచ్చిన నిధులు మాత్రమే.
దేశ జనాభాలో 4 శాతం వాటా ఉన్న ఏపీకి అన్ని రాష్ట్రాల మాదిరిగానే వసూలు చేసిన పన్నుల్లో వాటా ఇచ్చారని టీడీపీ నేతలు చెబుతున్నారు. అదే విధంగా రాష్ట్ర వార్షిక ప్రణాళికకు కేంద్ర మద్దతు లభించింది. విదేశీ ఆర్ధిక సాయం అందిందని కూడా నివేదికలో పేర్కొన్నారు.
దీంతో పాటు విభజన చట్ట ప్రకారం ఇచ్చిన హామీలను కేంద్రం ఇప్పటి వరకు నెరవేర్చలేదని, ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వని విషయాన్ని మరో నివేదికలో పొందుపరిచారు. ఆంధ్రప్రదేశ్‌కు పన్నుల్లో వందశాతం రాయితీ, విదేశీ ఆర్ధిక సాయంలో 90 శాతం గ్రాంటుల్లాంటి ప్రయోజనాలు కల్పించని అంశాలను ఇందులో ప్రస్తావించారు.

ఏపీకి ప్రత్యేక హోదా ఉంటే కేంద్రం నుంచి 90 శాతం గ్రాంటు లభిస్తుంది. ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు విదేశీ ఆర్ధిక సంస్థల నుంచి అందే రుణాల్లో 90 శాతం గ్రాంటుగా ఉంటుందన్న విషయాన్ని కూడా ఇందులో ప్రస్తావించారు. రాష్ట్రాలకు ప్రత్యేకహోదా లేకుంటే కేంద్రం ఇచ్చే గ్రాంటు 60 శాతమే.
అంతేకాదు కేంద్రం నుంచి తీసుకున్న విదేశీ రుణాలను వడ్డీతో సహా తిరిగి చెల్లించాల్సిన బాధ్యత రాష్ట్రాలపైనే ఉంటుంది. దీంతో ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వకపోవడం వల్ల కలిగే నష్టాలను ఈ నివేదికలో క్లుప్తంగా పొందుపరిచారు. దీంతోపాటు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 15 శాతం అదనపు తరుగుబడి రాయితీ, 15 శాతం అదనపు పెట్టుబడి రాయితీ వల్ల తక్షణ ప్రయోజనం ఉండదనే విషయం కూడా ప్రస్తావించారు.
మరోవైపు రెవెన్యూ లోటు భర్తీకి కేంద్రం ఇస్తున్న గ్రాంటు కూడా ప్రతిఏటా తగ్గిపోతోంది. తొలి ఏడాది 6,600 కోట్ల రూపాయులుగా ఉన్న గ్రాంటు, రెండో సంవత్సరానికి 4,600 కోట్లకు తగ్గింది. ఇదే విషయాన్ని రెండో నివేదికలో ప్రస్తావించారు. అంతేకాదు రాష్ట్ర విభజన వల్ల ఏపీకి జరిగిన నష్టాన్ని ఈ నివేదికలో ముఖ్యంగా ప్రస్తావించారు.
చివరకు విభజన చట్ట ప్రకారం ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం కల్పించిన ఆర్ధిక వెసులుబాటు రెండు సంవత్సరాల్లో ఏడు వేల కోట్ల రూపాయాలకు మించలేదన్న విషయాన్ని కూడా ఈ నివేదికలో పొందుపరిచారని తెలుస్తోంది. ఏది ఏమైనా ప్రధాని మోడీతో చంద్రబాబు భేటీ రాష్ట్రానికి కాస్త అయినా ఊరట కలిగించాలని ఆశిద్దాం.












Click it and Unblock the Notifications