టీడీపీ-జనసేన జోడీకి డిమాండ్ ! పునరాలోచనలో బీజేపీ-సీపీఐ స్నేహహస్తం !
తాజాగా కర్నాటకలో కాంగ్రెస్ పార్టీ సాధించిన భారీ విజయం ఏపీ రాజకీయాలపై ప్రభావం చూపుతోంది. ఇప్పటివరకూ బీజేపీతో అంటకాగుతున్న జనసేనతో పాటు పరోక్షంగా మద్దతిస్తున్న వైసీపీ, టీడీపీ కూడా ఆలోచనలో పడుతున్నాయి. అదే సమయంలో ఏపీలో బీజేపీ లేకుండా కూటమి ఏర్పాటు చేసుకుంటే ప్రయోజనం ఉంటుందని రాజకీయ పార్టీలు ఆలోచిస్తున్నాయి. కానీ ఇప్పటికే బీజేపీతో పొత్తులో ఉన్న జనసేన మాత్రం ఆ పార్టీని వీడితే ఎదురయ్యే ఇబ్బందులపై ఆలోచనలో పడుతోంది.
బీజేపీతో పొత్తులో ఉన్న జనసేన పార్టీ ఇతర విపక్షాల్ని కూడా కలుపుకుని పోరాటం చేసేందుకు ప్రయత్నిస్తోంది. అయితే ఇన్నాళ్లూ వైసీపీకి వ్యతిరేకంగా దూకుడుగా పోరాటం చేసేందుకు ముందుకు రాని బీజేపీ నేతలు ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఆలోచనలో పడ్డారు. టీడీపీని కూడా కలుపుకోవాలన్న పవన్ కళ్యాణ్ సూచనను గతంలో నిర్లక్ష్యంచేసిన రాష్ట్ర బీజేపీ నేతలు కూడా ఇప్పుడు కేంద్రంలో బీజేపీ అధిష్టానం దీనిపై పరిశీలన చేస్తోందని చెబుతున్నారు.

ఇలాంటి తరుణంలో బీజేపీ సై అంటే సరి లేకుంటే టీడీపీ-జనసేన కూటమితో ముందుకెళ్లిపోవాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. అదే జరిగితే బీజేపీకి గుడ్ బై చెప్పి టీడీపీ-జనసేన ఇతర పార్టీలతో కూటమి కట్టడం ఖాయం. ఇప్పటికే బీజేపీ అధిష్టానం టీడీపీని కూడా కలుపుకోవాలన్న పవన్ సూచనపై చర్చిస్తుందని రాష్ట్ర బీజేపీ నేతలు చెప్తుండగా.. వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన-సీపీఐ కూటమి కలిపి పోటీ చేస్తుందని ఇవాళ ఆ పార్టీ నేత రామకృష్ణ ప్రకటించారు.

ప్రస్తుతం రాష్ట్రంలో టీడీపీ, జనసేన పార్టీలతో తాము కలిసి పనిచేస్తున్నామని సీపీఐ రామకృష్ణ తెలిపారు. టీడీపీ-జనసేనతో కలిసి 2024 ఎన్నికల్లో పోటీ చేస్తామని స్పష్టం చేశారు. బీజేపీతో కలిసి పోటీ చేయద్దని పవన్ కళ్యాణ్‌కు చెపుతామన్నారు. పాచిపోయిన లడ్డులు, మంచి లడ్డులు ఎలా అయ్యాయో పవన్ కళ్యాణ్ చెప్పాలని రామకృష్ణ డిమాండ్ చేశారు. తద్వారా వైసీపీపై పోరాటంలో ముందుకు రాని బీజేపీని వదిలి తమతో కలిసి పోరాడాలని పవన్ ను రామకృష్ణ కోరుతున్నారు.












Click it and Unblock the Notifications