పురందేశ్వరి కొత్త టీం ఎంపిక, కొత్త వ్యూహాలు - పొత్తులపైన కీలకంగా..!!
ఏపీలో బీజేపీ కొత్త గేమ్ మొదలు పెట్టింది. పురందేశ్వరికి అధ్యక్ష బాధ్యతలు ఇవ్వట ద్వారా తమ లక్ష్యం స్పష్టం చేసింది. అధ్యక్ష బాధ్యతలతో పాటుగా పార్టీ ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది. పార్టీలో కొత్త నియామకాలు.. కమిటీల ఏర్పాటుకు పురందేశ్వరికి ఫ్రీ హ్యాండ్ ఇస్తూ కేంద్ర నాయకత్వం హామీ ఇచ్చింది. ఇదే సమయంలో పొత్తుల పైన పురందేశ్వరితోనూ పార్టీ అధ్యక్షుడు చర్చించినట్లు విశ్వసనీయ సమాచారం. పార్టీని ఎన్నికలకు సిద్దం చేసే క్రమంలో పూర్తి టీంను ఖరారు చేస్తూనే బాధ్యతలు స్వీకరించాలని పురందేశ్వరి నిర్ణయించారు.
బీజేపీలో మార్పులు : బీజేపీని ఏపీలో సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు ముందుగా పార్టీలో మార్పులు అవసరమని కొత్త అధ్యక్షురాలు పురందేశ్వరి భావిస్తున్నారు. తనకు అధ్యక్ష బాధ్యతలు అప్పగించింనందుకు పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డాని కలిసి ధన్యవాదాలు తెలిపారు. అదే సమయంలో పార్టీ రాష్ట్ర కమిటీ...జిల్లాల కమిటీల కూర్పు పైనా చర్చించినట్లు తెలుస్తోంది.

ఢిల్లీలోనే ఏపీలో కొత్త కమిటీల ఏర్పాటు పైన కసరత్తు చేస్తున్నారు. ఎన్నికల సమయం కావటంతో పార్టీకి పూర్తి స్థాయిలో పని చేసే వారికి ప్రాధాన్యత ఇచ్చేలా ఈ కూర్పు ఉంటుందని చెబుతున్నారు. ప్రస్తుతం కమిటీల పైన పూర్తి సమాచారం తెప్పించుకున్న పురందేశ్వరి పార్టీలో వారి పని తీరు పైన ఆరా తీస్తున్నారు.
పొత్తుల్లో కీలకంగా : వివాదాలు, ఆరోపణలు, స్థాయికి మంచి వ్యవహరిస్తున్న నేతలను పూర్తిగా పక్కన పెట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. పార్టీ అధ్యక్షుడిని కలిసిన సమయంలో ఎన్నికలకు పార్టీని సిద్దం చేసే క్రమంలో ఏ నిర్ణయం తీసుకున్నా అభ్యంతరం లేదని స్పష్టం చేసినట్లు సమాచారం. ప్రస్తుత కమిటీల్లో కొన్ని మార్పులు ఖాయంగా కనిపిస్తోంది. వచ్చే వారం ఢిల్లీ నుంచి పురందేశ్వరి రాష్ట్రానికి రానున్నారు.
విజయవాడ కు వచ్చే క్రమంలో పురందేశ్వరికి భారీగా స్వాగతం పలికేందుకు పార్టీ శ్రేణులు సిద్దం అవుతున్నారు. విమానాశ్రయం నుంచి పార్టీ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించనున్నారు. ఇదే సమయంలో పురందేశ్వరి పార్టీ పొత్తులు..జనసేనతో మైత్రి విషయంలోనూ కీలకంగా మారనున్నారు.

బీజేపీ నిర్ణయంపై ఆసక్తి : సోము వీర్రాజు పార్టీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో పవన్ కల్యాణ్ ఫిర్యాదులు చేసారు. రెండు పార్టీలు కలిసి పోరాటం చేయటంలో కలిసి రావటం లేదని చెప్పుకొచ్చారు. ఇప్పుడు పవన్ కల్యాణ్ ఎన్నికల పొత్తుల్లో భాగంగా బీజేపీతో పాటుగా టీడీపీతోనూ కలిసి ప్రయాణం చేయాలని భావిస్తున్నారు. ఇందుకు బీజేపీ నాయకత్వం ఇప్పటి వరకు స్పష్టత ఇవ్వలేదు.
ఈ సమయంలో జనసేనతో మాత్రం పొత్తు కొనసాగుతుందని స్పష్టం చేస్తున్నారు. టీడీపీతో పొత్తు పైన బీజేపీ ఇప్పటి వరకు తేల్చలేదు. పవన్ ఈ నిర్ణయం కోసమే వేచి చూస్తున్నారు. బీజేపీ తమ వైఖరి తేల్చితే..రాజకీయంగా ఏపీలో కీలక పరిణామాలు చోటు చేసుకొనే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications