బాబుని చిక్కుల్లో పెడుతున్న బీజేపీ, స్లోగా.. జగన్ కేసుపై సోమిరెడ్డి సంచలనం
రాజమహేంద్రవరం/విజయవాడ: టిడిపి - బీజేపీ మధ్య సఖ్యత ఉందని చెబుతున్నప్పటికీ.. సమయం చిక్కినప్పుడల్లా ఏపీ బీజేపీ నేతలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును, తెలుగుదేశం పార్టీని చిక్కుల్లో పెట్టేందుకు వెనుకాడటం లేదని చెప్పవచ్చు.
ప్రత్యేక హోదా, నిధుల విషయంలో ఇటీవలి వరకు బిజెపి, టిడిపిల మధ్య మాటల యుద్ధం కనిపించింది. ఆ తర్వాత సద్దుమణిగింది. అయితే, ఇప్పుడు కాపు నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అంశంలో కూడా బీజేపీ మిత్రపక్షం టిడిపిని వదిలి పెట్టడం లేదు.

నాలుగు రోజుల క్రితం బీజేపీ ఎమ్మెల్యఏ ఆకుల సత్యనారాయణ రాజమహేంద్రవరంలో ముద్రగడ పద్మనాభంను పరామర్శించారు. తాజాగా, మరో బీజేపీ నేత టిడిపి ప్రభుత్వానికి ఝలక్ ఇచ్చారు.
ఏపీ బీజేపీ జనరల్ సెక్రటరీ సురేష్ రెడ్డి సోమవారం నాడు మాట్లాడుతూ... టిడిపి ఇచ్చిన హామీనే ముద్రగడ నెరవేర్చాలని కోరుతున్నారని, అలాంటి వ్యక్తి పైన పోలీసులు వ్యవహరించిన తీరు బాధాకరమని చెప్పారు. అలాగే, రాజధాని ఉద్యోగులను తరలించడం పైనా స్పందించారు. ఉద్యోగులను బలవంతంగా తీసుకెళ్లం సరికాదని, అందరితో చర్చించి ఆమోదయోగ్యంగా తరలించాలన్నారు.
జగన్ ఆస్తుల కేసుపై సోమిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్య
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ పైన టిడిపి ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సోమవారం నాడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో జగన్ అశాంతి సృష్టిస్తున్నారన్నారు. జగన్ అక్రమాస్తులపై విచారణను కింది కోర్టులు జాప్యం చేస్తున్నాయని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
జగన్‌పై కేసుల విచారణను వేగవంతం చెయ్యాలని డిమాండ్ చేశారు. ఎంపీ, ఎమ్మెల్యేల అవినీతి కేసుల విచారణను ఏడాదిలోగా పూర్తి చేయాలని సుప్రీం కోర్టు చెప్పిందన్నారు. జగన్‌కు ఓ న్యాయం, సామాన్యులకు మరో న్యాయమా అని ప్రశ్నించారు.
రెండున్నరేళ్లలో ఒక్క కేసు పైనా జడ్జిమెంట్ రాలేదన్నారు. జగన్ కేసులపై విచారణ వేగవంతం చేయాలన్నారు. జగన్‌కు పోలవరం ప్రాజెక్టు పైన శ్రద్ధ లేదని మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు అన్నారు. గాలేరు - నగరిని అడ్డుకునేందుకు వైసిపి ఎమ్మెల్యేలతో కోర్టులో పిటడిషన్ వేయించారన్నారు.












Click it and Unblock the Notifications