హైకోర్టును ఆశ్రయించిన ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి
హైదరాబాద్ లోని సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ(ఎన్పీఏ) లో ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డిపై లైంగిక ఆరోపణల కేసు ఊహించని మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన ఉదయ్ కృష్ణారెడ్డి తాజాగా హైకోర్టును ఆశ్రయించాడు. తనపై నమోదైన కేసును కొట్టివేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఈ పిటిషన్ పై రేపు విచారణ జరగనుంది. ఉదయ్ కృష్ణారెడ్డి తనను లైంగికంగా వేధించాడని ట్రైనీ మహిళా ఐపీఎస్ అధికారి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో అతనిపై కేసు నమోదైన సంగతి తెలిసిందే.
అంతకుముందు ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యకు పాల్పడి ఆస్పత్రిలో జాయిన్ అయినట్లు కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఉదయ్ కృష్ణారెడ్డి మోతీ నగర్ లోని తన బంధువు ఇంటికి వెళ్లి అక్కడే అపస్మారక స్థితిలోకి వెళ్లాడు.. అయితే ఆయన సూసైడ్ కు పాల్పడి ఉండొచ్చని వెంటనే ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. కానీ పోలీసుల దర్యాప్తులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.
ఉదయ్ కృష్ణారెడ్డి సానుభూతి కోసం సూసైడ్ నాటకం ఆడాడని తేలింది. అతని రక్త నమూనాలను పరీక్షించిన వైద్యులు.. రక్తంలో ఎలాంటి విష పదార్థం లేదని రిపోర్టు ఇచ్చారు. దాంతో సానుభూతి కోసం ఆడిన నాటకం అని పోలీసులు నిర్థారణకు వచ్చారు. మద్యం మత్తులోనే సూసైడ్ నోట్ రాసినట్టు భావిస్తున్నారు. అయితే మంచం పక్కనే మద్యం సీసా, శానిటైజర్ ఉండటంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు బంధువులు అనుమానించారు.

ఇక జాతీయ పోలీస్ అకాడమీలో ఇలాంటి ఘటన జరగడంపై దర్యాప్తు జరిపేందుకు అధికారులు అంతర్గత కమిటీ వేశారు. ఈ నివేదికను కేంద్ర ప్రభుత్వానికి పంపి నిందితుడిపై తదుపరి చర్యలు తీసుకోనున్నారు. ఇదిలా ఉంటే ఉదయ్ కృష్ణారెడ్డి మాత్రం తనకు మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిణితో ఏడాదిగా రిలేషన్ కొనసాగుతోందని అన్నాడు. తమ మధ్య జరిగిన వాట్సప్ చాట్ లు, ఫొటోలు, వీడియోలు ఉన్నాయని, వాటిని ఇప్పటికే ఆమె భర్తకు పంపినట్లు పేర్కొన్నాడు. తన ఆత్మహత్యాయత్నానికి ఆ మహిళతో పాటు మరో నలుగురు కారణమని ఆరోపించాడు.


Click it and Unblock the Notifications