టీడీపీతో పొత్తుకు బీజేపీ తాజా కండీషన్ - చంద్రబాబు సిద్దమేనా..!!
ఏపీలో ఎన్నికల పొత్తులు కొత్త టర్న్ తీసుకుంటున్నాయి. జగన్ ఓటమే లక్ష్యంగా చంద్రబాబు, పవన్ ఒక్కటయ్యారు. తమతో బీజేపీ కలిసి వస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ సమయంలోనే పొత్తుల అంశం పై బీజేపీలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. టీడీపీ - బీజేపీ మధ్య గ్యాప్ భర్తీ చేసేందుకు పవన్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక, పొత్తు విషయంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. బీజేపీ తమ కండీషన్ ఏంటో తేల్చేసింది. ఇక చంద్రబాబు నిర్ణయం తీసుకోవాలి.
పొత్తుల లెక్కలు:ఏపీలో జగన్ వ్యతిరేక ఓటు చీలకూడదనే ఉద్దేశంతోనే తమ రెండు పార్టీలు పొత్తు ఖాయం చేసుకున్నామని చంద్రబాబు, పవన్ చెబుతూ వచ్చారు. కానీ, షర్మిల ఎంట్రీతో ఆ లెక్క మారే అవకాశం కనిపిస్తోంది. ఇటు బీజేపీతో పొత్తు విషయంలో కొత్త అంశాలు తెర మీదకు వస్తున్నాయి. బీజేపీతో పొత్తు పైన టీడీపీలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. బీజేపీతో పొత్తు వద్దనేది మెజార్టీ టీడీపీ నేతల భావన. కానీ, జగన్ ను ఎదుర్కోవాలంటే ఎలక్షనీరింగ్ లో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మద్దతు అవసరమని చంద్రబాబు, పవన్ భావిస్తున్నారు. ఇదే సమయంలో సీట్ల పంపకాలు మూడు పార్టీల మధ్య సమస్యగా మారే ఛాన్స్ ఉందనే వాదన ఉంది. ఈ సమయంలోనే బీజేపీ - టీడీపీ మధ్య రాయబారాలు మొదలయ్యాయి.

బీజేపీ కలిసేనా:ఎన్నికల్లో పొత్తుల నిర్ణయం ఆలస్యమైందని..ఎన్నికల తరువాత పొత్తు ఎన్డీఏలో చేరుదామనే ఆలోచనకు చంద్రబాబు వచ్చినట్లు పార్టీ నేతల సమాచారం. అయితే, మరి కొద్ది రోజులు వేచి చూద్దామని పవన్ సూచనగా తెలుస్తోంది. ఈ సమయంలోనే బీజేపీ నుంచి కొత్త కండీషన్ తెర మీదకు వచ్చినట్లు సమాచారం. ఎన్డీఏలో ఇప్పటికే భాగస్వాములుగా ఉన్న బీజేపీ, జనసేన టీడీపీతో కలిసి పోటీ చేసేందుకు తమ రెండు పార్టీలకు 45 ఎమ్మెల్యే సీట్లతో పాటుగా 8 లోక్ సభ సీట్లు ఇవ్వాలని కోరినట్లు తెలుస్తోంది. అదే సమయంలో ఎన్నికల ముందే టీడీపీ ఎన్డీఏలో చేరాలని..ఎన్డీఏ కూటమిగానే ఎన్నికల బరిలోకి దిగాలని సూచించినట్లు సమాచారం. టీడీపీ పేరుతో కాకుండా ఎన్డీఏ కూటమిగానే ప్రచారం చేయాలని చెప్పినట్లు తెలుస్తోంది.
చంద్రబాబు సిద్దమేనా:ఇక, టీడీపీకి నవ్ ఆర్ నెవర్ గా మారుతున్న ఈ లెక్కల్లో ఇప్పుడు బీజేపీ షరతులకు చంద్రబాబు అంగీకరిస్తారా లేదా అనే చర్చ మొదలైంది. ఎన్డీఏగా ఎన్నికల బరిలోకి దిగటం ద్వారా కొన్ని వర్గాలు తమకు దూరం అవుతాయనే అభిప్రాయం టీడీపీలో ఉంది. ప్రతీ సీటు..ప్రతీ ఓటు కీలకంగా మారుతున్న ఈ సమయంలో తెలిసి కొందరిని దూరం చేసుకోవటమేననే చర్చ వినిపిస్తోంది. అదే సమయంలో బీజేపీ పైన ఏపీ ప్రజల్లో వ్యతిరేకత ఉందని..ఆ పార్టీతో కలవటం వలన ఓట్ల పరంగా ఎలాంటి ప్రయోజనం లేదంటూ అంతర్గత చర్చల్లో విశ్లేషిస్తున్నారు. ఏపీలో కాంగ్రెస్,వామపక్షాలు కలిసి ఇండియా కూటమిగా బరిలోకి దిగుతున్న సమయంలో..తమ మూడు పార్టీలు ఎన్డీఏ కూటమిగానే పోటీ చేయాలనేది బీజేపీ ఆలోచన. టీడీపీ అనే ప్రస్తావన లేకుండా ఎన్డీఏ గా మాత్రమే ముందుకు వెళ్లాలనే ఈ ప్రతిపాదన పైన చంద్రబాబు తుది నిర్ణయం ఏంటనేది ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications