పీటముడి: చంద్రబాబుపై బిజెపి గుర్రు, పొత్తుకు నో
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీతో పొత్తుపై పడిన పీటముడి వీడడం లేదు. సీట్ల కేటాయింపు విషయంలో తెలుగుదేశం పార్టీ ఏ మాత్రం పట్టువిడుపులు ప్రదర్శించకపోవడంతో బిజెపి సీమాంధ్ర నేతలు గుర్రుగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి తీరు మీద తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. బిజెపి ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ ప్రకాష్ జవదేకర్ శుక్రవారం చంద్రబాబును కలిసినా పెద్దగా ఫలితం కనిపించలేదు.
బిజెపికి తెలుగుదేశం పార్టీ సీమాంధ్రలో పది శాసనసభా స్థానాలు, మూడు లోకసభ స్థానాలు మాత్రమే ఇస్తానని చెబుతోంది. అంతకు మించి ఒక్క సీటు కూడా ఇవ్వలేమని అంటోంది. దీంతో తెలుగుదేశం పార్టీతో పొత్తు అవసరం లేదని, వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని బిజెపి సీమాంధ్ర నాయకులు అంటున్నారు. ఈ స్థితిలో ప్రకాష్ జవదేకర్ రేపు ఆదివారం విశాఖపట్నంలో సీమాంధ్ర నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు.

బిజెపి లోకసభ నియోజకవర్గానికి ఒక్కటి చొప్పున శాసనసభా స్థానాలను తమకు కేటాయించాలని అడుగుతోంది. అదే విధంగా మరో రెండు లోకసభ స్థానాలు కావాలని అడుగుతోంది. విజయవాడ, విశాఖపట్నం సీట్లు కావాలని డిమాండ్ చేస్తోంది. ఈ రెండు సీట్లు ఇవ్వడానికి తెలుగుదేశం పార్టీ సుముఖంగా లేదు.
బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ సూచన మేరకే తెలుగుదేశంతో పొత్తులపై బిజెపి నాయకులు చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకోవద్దని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) బిజెపికి సూచించినట్లు తెలుస్తోంది. తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీతో పొత్తుకు ఈ ప్రాంత బిజెపి నాయకులు సుముఖంగా లేరు.












Click it and Unblock the Notifications