జగన్ జైలుకెళ్లడం, చిప్పకూడు తినడం తప్పదు - బీజేపీ ఎమ్మెల్యే
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ త్వరలో జైలుకు వెళ్లబోతున్నారని జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి జోస్యం చెప్పారు. లిక్కర్ స్కాం కేసులో జగన్ జైలుకెళ్లడం.. చిప్పకూడు తినడం తప్పదని హెచ్చరించారు. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారాయి.
గత ప్రభుత్వం హయాంలో లిక్కర్ అమ్మకాల్లో భారీగా అవకతవకలు జరిగాయని కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసుకు సంబంధించి సిట్ అధికారులు ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. అలాగే కస్టడీలోకి తీసుకుని మరింతగా విచారణ జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో లిక్కర్ స్కామ్‌పై ఆదినారాయణ రెడ్డి మాట్లాడుతూ.. జగన్ మాత్రమే కాకుండా.. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి కూడా జైలుకు వెళ్లే పరిస్థితి ఏర్పడుతుందని జోస్యం చెప్పారు.

ఈ పరిస్థితిని జగన్ కూడా అర్థం చేసుకున్నారని ఎమ్మెల్యే ఎద్దేవా చేశారు. అందుకే ప్రతిరోజూ మీడియా ఎదుట మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారని ఆయన విమర్శించారు. అంతే కాకుండా సీఎం చంద్రబాబు నాయుడుపై జగన్ చేసిన వ్యాఖ్యలకి స్పందిస్తూ.. లిక్కర్ స్కాం ఉందని బేతాళ కథలు చెబుతున్నారంటూ మండిపడ్డారు. చంద్రబాబును విమర్శించే నైతిక హక్కు జగన్‌కి లేదంటూ కామెంట్స్ చేశారు.
గత ఐదేళ్లలో జగన్ ప్రభుత్వం చేసిన అప్పులతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారిందని ఆరోపించారు. అయితే ప్రస్తుతం బీజేపీ మద్దతుతో ఏర్పడిన కూటమి ప్రభుత్వం, రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తోందని ఆదినారాయణ రెడ్డి తెలిపారు. పలు కీలక రంగాల్లో అభివృద్ధి పనులకు పునాదులు వేసినట్లు పేర్కొన్నారు. మరోవైపు లిక్కర్ స్కాంలో ఇంకా ఎంతమంది నేతలు అరెస్ట్ అవతారో అని సర్వత్రా చర్చ నడుస్తోంది.












Click it and Unblock the Notifications