బిజెపిలో టి కలకలం:వెంకయ్యపై పార్టీ ఎమ్మెల్యే ఆగ్రహం
హైదరాబాద్/న్యూఢిల్లీ: ప్రధాన ప్రతిపక్షం భారతీయ జనతా పార్టీలో విభజన వేడి రాజుకుంది. పార్టీ సీనియర్ నేత వెంకయ్య నాయుడు తీరు పైన మహబూబ్ నగర్ బిజెపి శాసన సభ్యులు యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఆదివారం నిప్పులు చెరిగారు. జాతీయ నేత అయిన వెంకయ్యను ఆయన ప్రశ్నించడం పార్టీలో కలకలం సృష్టించింది. రాష్ట్ర విభజన విషయంలో అసమ్మతి గళం వినిపించింది. ఆదివారం నాటి పరిణామాలతో పార్టీలో విభేదాలు బయటపడ్డాయి.
పార్లమెంటులో పెట్టే బిల్లును సమగ్రంగా పరిశీలించాకే మద్దతుపై నిర్ణయం తీసుకుంటామని వెంకయ్య నాయుడు చేసిన వ్యాఖ్యలపై పార్టీ ఎమ్మెల్యే యెన్నం విరుచుకుపడ్డారు. వెంకయ్య జాతీయ నేతగా మాట్లాడుతున్నారా? సీమాంధ్ర నాయకుడిగా మాట్లాడుతున్నారా? అని యెన్నం ప్రశ్నించారు. షరతులు లేకుండా తెలంగాణ బిల్లుకు మద్దతు తెలుపుతామని బిజెపి మొదటి నుండి చెబుతోందని, వెంకయ్య వ్యాఖ్యలు పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఉన్నాయన్నారు.

తెలంగాణ బిల్లు పార్లమెంటులో ప్రవేశ పెట్టనున్న కీలక సమయంలో వెంకయ్య వ్యాఖ్యలు సరికాదని అభిప్రాయపడ్డారు. మీడియా సమావేశంలో యెన్నం మాట్లాడే వరకు వెంకయ్యపై ఆయన విరుచుకుపడతారన్న విషయం తమకు తెలియదని కొందరు నేతలు చెబుతుండగా, పార్టీ తెలంగాణ ఉద్యమ కమిటీ ఆమోదంతోనే వెంకయ్యపై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేసినట్లు మరికొందరు నేతలు పేర్కొంటున్నారు.
అయితే బిజెపికి చెందిన రాష్ట్ర నేత ఒకరు పార్టీ అగ్రనేతల్లో ఒకరైన వెంకయ్యపై విరుచుకుపడటం ఇదే తొలిసారి. వెంకయ్య టిడిపికిసన్నిహితంగా ఉంటున్నారని, ఆయన తెలంగాణ బిల్లుకు అడ్డుపడే ప్రయత్నం చేస్తున్నారని విస్తృత ప్రచారం జరుగుతున్నప్పటికీ, పార్టీకి చెందిన రాష్ట్ర నేతలు సంయమనం పాటిస్తూ వస్తున్నారు. అయితే బిజెపి అగ్ర నాయకత్వంలోని కొందరి మద్దతుతోనే పార్టీ తెలంగాణ ఉద్యమ కమిటీ తరఫున వెంకయ్యపై ఎమ్మెల్యే యెన్నం విమర్శలకు దిగారని అంటున్నారు.
దీంతో తెలంగాణ బిల్లు పార్లమెంటుకు రానున్న కీలక సమయంలో బిజెపిలోను తెలంగాణ చిచ్చు రోడెక్కినట్లయింది. నిజానికి యెన్నం మొదటి నుంచి గట్టి తెలంగాణవాది. తెలంగాణ కోసం ఆయన తన ప్రభుత్వ ఉద్యోగాన్ని వదులుకుని తెరాసలో చేరారు. తాజాగా వెంకయ్యపైనే ఆయన విమర్శలు గుప్పించడం పట్ల పార్టీ శ్రేణులు కొంత అసహనానికి గురైనట్లు తెలుస్తోంది. మరోపక్క యెన్నం సరిగానే మాట్లాడారంటూ తెలంగాణ ప్రాంత నేతలు వెనకేసుకొస్తున్నారు.
యెన్నం వ్యాఖ్యలపై పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి స్పందించారు. పార్టీలో సీనియర్ నేత వెంకయ్యకు తెలంగాణ విషయంలో స్పష్టత ఉందని చెప్పారు. వెంకయ్య రాష్ట్రాలుగా విడిపోవాలని కోరుకుంటున్నారే తప్ప ప్రజలు విడిపోవాలని కోరుకోవడం లేదన్నారు. చాలా సందర్భాల్లో తెలంగాణ ప్రజలకు అండగా నిలబడ్డారని, రాజ్యసభలో తెలంగాణకు అనుకూలంగా మాట్లాడారని గుర్తు చేశారు. అలాంటి వ్యక్తిపై యెన్నం వ్యతిరేక వ్యాఖ్యలు చేయడం సరికాదని, వాటిని ఖండిస్తున్నానని చెప్పారు. యెన్నం అలా ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందో వివరణ కోరుతానని తెలిపారు.












Click it and Unblock the Notifications