ఇదే సరైన సమయం- పవన్ స్పీడ్ కు బ్రేక్, బీజేపీ కొత్త రోడ్ మ్యాప్..!!
ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. చంద్రబాబు అరెస్ట్ తో ఒక్కసారిగా కొత్త లెక్కలు తెర మీదకు వచ్చాయి. టీడీపీ ఈ పరిణామాలు తమకు సానుభూతిగా మారి కలిసి వస్తాయని అంచనా వేస్తోంది. వైసీపీ ప్రజల్లో చంద్రబాబు అరెస్ట్ పై స్పందన లేదని చెబుతోంది. అటు బీజేపీ ఈ మొత్తం పరిణామాలపైన మౌనంగా ఉంది. ఇదే సమయంలో ఏపీలో నెలకొన్ని పరిస్థితులను అనుకూలంగా మలచుకొనేందుకు కొత్త రోడ్ మ్యాప్ సిద్దం చేస్తోంది.
మారుతున్న సమీకరణాలు:చంద్రబాబు అరెస్ట్ తో ఏపీ రాజకీయ సమీకరణాల్లో మార్పు కనిపిస్తోంది. ఇప్పటి వరకు టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు ఖాయమనే అభిప్రాయం సర్వత్రా వినిపించింది. కొద్ది రోజుల క్రితం ఢిల్లీ పర్యటనలో టీడీపీ అధినేత చంద్రబాబు ఇవే రకమైన సంకేతాలు ఇచ్చారు.

చంద్రబాబు అరెస్ట్ వ్యవహారంలో ఇప్పటి వరకు బీజేపీ నుంచి స్పందన లేదు. దీని ద్వారా వారు టీడీపీతో భవిష్యత్ లో కొనసాగే అవకాశం లేదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఏపీలో ఎదిగేందుకు ఇదే సరమైన సమయంగా బీజేపీ ఆలోచన చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇందులో బాగంగా చంద్రబాబుకు రిమాండ్ తరువాత తన మద్దతు ప్రకటించిన పవన్.. ఇప్పుడు మౌనంగా ఉంటున్నారు. వరుస పరిణామాలపైన వేచి చూసే ధోరణితో కనిపిస్తున్నారు.
ఇదే సరైన సమయం:ఇదే సమయంలో కొత్త చర్చ తెర మీదకు వచ్చింది. చంద్రబాబు అరెస్ట్ పైన బీజేపీ స్పదించకపోవటం పవన్ లో ఆలోచనకు కారణంగా చెబుతున్నారు. ఎన్డీఏ భాగస్వామిగా ఉన్న పవన్ కల్యాణ్ వచ్చే ఎన్నికల్లో జగన్ ను ఓడించేందుకు తమతో టీడీపీని కలుపుకొని వెళ్లాలని భావించారు.
ఆ దిశగా ప్రయత్నాలు చేసారు. కానీ, ఇప్పటి వరకు సానుకూలత రాకపోగా..చంద్రబాబు అరెస్ట్ వేళ ఢిల్లీ మౌనం పవన్ కు అంతు చిక్కటం లేదు. ఇదే సమయంలో చంద్రబాబు అరెస్ట్ వేళ నిరసించిన పవన్..ఇప్పుడు కొంత ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది. అవినీతి ఆరోపణలపైన అరెస్ట్ అయిన చంద్రబాబును ఏకపక్షంగా సమర్ధిస్తే అది ఎన్డీఏ కూటమికి నష్టం చేస్తుందని కొందరు కమలం నేతలు పవన్ దూకుడుకు బ్రేకులు వేసినట్లు ప్రచారం సాగుతోంది.

పవన్ సిద్దంగా ఉన్నారా:చంద్రబాబు అరెస్ట్ తో టీడీపీలో పరిస్థితులు..ఏపీలో రాజకీయంగా నెలకొన్న పరిణామాలను తమకు అనకూలంగా మలచుకొనేందుకు ఇది సరైన సమయంగా బీజేపీ నేతలు పవన్ కు వివరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకొని బీజేపీ - జనసేన కూటమి బలోపేతానికి రెండు పార్టీలు ప్రయత్నించాలని సూచించినట్లు చెబుతున్నారు. జనసేనకు 14 శాతం ఓటింగ్ ఉందని..
ఈ పరిస్థితుల్లో రెండు పార్టీల ఓటింగ్ శాతం పెరిగేందుకు అవకాశం ఉందని చెబుతున్నట్లు సమాచారం. అయితే, టీడీపీతో పొత్తు లేకపోతే వైసీపీకి మేలు జరిగే అవకాశం ఉందనేది పవన్ అంచనా. అటు చంద్రబాబుపైన అవినీతి ఆరోపణలతో బీజేపీ నేతలు టీడీపీతో జత కట్టేందుకు సిద్దంగా లేరని ఆ పార్టీ నేతల అంచనా. దీంతో, ఇప్పుడు పవన్ బీజేపీ తాజా ఆలోచనలతో ఏం చేస్తారనేది రాజకీయంగా ఉత్కంఠ పెంచుతోంది.












Click it and Unblock the Notifications