One Nation-One Election :జమిలి ఎన్నికలపై పురందేశ్వరి కీలక వ్యాఖ్యలు- నెక్స్ట్ అదే..!
దేశవ్యాప్తంగా జమిలి ఎన్నికల నిర్వహణకు కేంద్ర కేబినెట్ నిన్న పచ్చజెండా ఊపింది. ఈ మేరకు మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ గోవింద్ కమిటీ ఇచ్చిన రిపోర్టుకు ఆమోదం తెలిపింది. దీంతో త్వరలో జమిలి ఎన్నికల దిశగా కేంద్రం మరింత వేగంగా అడుగులు వేయబోతోందని తెలిపోయింది. తమ హయాంలోనే జమిలి ఎన్నికల్ని నిర్వహించి తీరుతామని హోంమంత్రి అమిత్ షా కూడా తేల్చిచెప్పేశారు. ఈ నేపథ్యంలో రాజమండ్రి బీజేపీ ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి జమిలి ప్రతిపాదనపై స్పందించారు.
జమిలి ఎన్నికలకు తాము మద్దతు ఇస్తున్నట్లు ఏపీ బీజేపీ ఛీఫ్ పురందేశ్వరి తెలిపారు. జమిలి ఎన్నికలపై పార్లమెంట్ లో రాజ్యాంగ సవరణ జరగాల్సి ఉందన్నారు. త్వరలో ఇది చేపడతామన్నారు. జమిలిలో భాగంగా పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల తర్వాత వంద రోజులకు స్థానిక ఎన్నికలు జరుగుతాయని వెల్లడించారు. అభివృద్ధికి అవరోధం లేకుండా ఉండేందుకే జమిలి ఎన్నికలు అని పురందేశ్వరి పేర్కొన్నారు.

దేశంలో ఒకేసారి ఎన్నికలు అయిపోతేనే అభివృద్ధి సాధ్యమని బీజేపీ ఎంపీ పురందేశ్వరి తెలిపారు. జమిలి ఎన్నికలపై మంచి ఆశతో ఉన్నామన్నారు. దేశ మంచిని దృష్టిలో పెట్టుకుని జమిలి ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ కూడా ఆలోచన చేయాలని ఆమె కోరారు. మరోవైపు యూఎస్ లో లోక్ సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. విదేశాలకు వెళ్లి కాంగ్రెస్ దేశ గౌరవాన్ని భంగం చేస్తుందని పురందేశ్వరి విమర్శించారు.












Click it and Unblock the Notifications