కేసీఆర్ బీఆర్ఎస్ రాకతో జగన్ కు ఇబ్బందులివే ? అసలు ఫ్రెండ్ ఎవరో తేలిపోతుందా !
తెలంగాణ సీఎం కేసీఆర్ పెట్టబోతున్న జాతీయ పార్టీ బీఆర్ఎస్ ఏపీలో సీఎం వైఎస్ జగన్ పై ఎలాంటి ప్రభావం చూపబోతోందనే చర్చ మొదలైంది. కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టిన తర్వాత తెలుగు రాష్టమైన ఏపీకి రాక తప్పదు. అదే జరిగితే టీఆర్ఎస్ విషయంలో జగన్ వైఖరి ఎలా ఉండబోతోందన్నది చర్చనీయాంశమవుతోంది. అలాగే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో ఇన్నాళ్లూ సఖ్యతగా ఉంటున్న జగన్.. బీఆర్ఎస్ వచ్చాక ఎలాంటి వైఖరి తీసుకోబోతున్నారనే చర్చ కూడా సాగుతోంది.

ఏపీలో కేసీఆర్ జాతీయ పార్టీ
తెలంగాణ సీఎం కేసీఆర్.. బీజేపీతో పోరులో భాగంగా త్వరలో కొత్తగా తన ప్రాంతీయ పార్టీ టీఆర్ఎస్ ను జాతీయ స్ధాయిలో బీఆర్ఎస్ గా మార్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. టీఆర్ఎస్ ను జాతీయ పార్టీగా మార్చడం ద్వారా పలు రాష్ట్రాల్లో బీజేపీ ప్రభావంపై దెబ్బ కొట్టాలనేది కేసీఆర్ వ్యూహంగా కనిపిస్తోంది. మరి అలాంటప్పుడు బీజేపీ ప్రభావం నామమాత్రంగా ఉ్న తెలుగు రాష్ట్రమైన ఏపీలో కేసీఆర్ ఎంట్రీ ఉంటుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ కేసీఆర్ ఏపీలో అడుగుపెడితే ఇక్కడి రాజకీయాలు ఎలా మారబోతున్నాయన్న చర్చ జరుగుతోంది.

వైసీపీపై పడే ప్రభావం
కేసీఆర్ బీఆర్ఎస్ పేరుతో జాతీయ పార్టీ పెడితే ఏపీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తే మాత్రం కచ్చితంగా ఇక్కడ అదికారంలో ఉన్న వైసీపీకి ఇబ్బందులు తప్పకపోవచ్చని తెలుస్తోంది. అన్నింటికంటే ముఖ్యంగా కేంద్రంలో బీజేపీతో సత్సంబంధాలు నెరుపుతున్న జగన్.. కేసీఆర్ జాతీయ పార్టీ విషయంలో ఎలా స్పందించినా అది వార్తల్లోకి చేరడం కాయం.
అలాగే కేసీఆర్ పార్టీతో జగన్ పొత్తు పెట్టుకుంటారా లేక ప్రత్యర్ధిగా భావిస్తారా అన్న దానిపైనా ఆసక్తి పెరుగుతోంది. దీంతో వైసీపీపై కేసీఆర్ జాతీయ పార్టీ చూపే ప్రభావంపై వైసీపీలో సైతం జోరుగా చర్చ సాగుతోంది.

అసలు మిత్రుడెవరో తేలిపోతుందా?
ఏపీలో వైసీపీ అధికారంలోకి రాకముందు నుంచీ కేసీఆర్ తో వైఎస్ జగన్ సఖ్యత కొనసాగించారు. అయితే గతేడాది ఇరు రాష్ట్రాల మధ్య తలెత్తిన జల వివాదాల నేపథ్యంలో కేసీఆర్, జగన్ మధ్య సఖ్యత కొంత చెడినా, అంతిమంగా ఇరువురూ మిత్రులుగానే ఉన్నారు. అదే సమయంలో జగన్ కేంద్రంలో బీజేపీతో సఖ్యతగా ఉన్నారు. కానీ కేసీఆర్ మాత్రం బీజేపీపై విరుచుకుపడుతున్నారు. ఈ తరుణంలో కేసీఆర్ కొత్త పార్టీతో ఏపీలోకి ఎంట్రీ ఇస్తే అప్పుడు కేసీఆర్, బీజేపీల్లో ఒకదానివైపే జగన్ మొగ్గుచూపాల్సి వస్తుంది. దీంతో రహస్యంగా స్నేహం చేస్తున్న బీజేపీ కావాలో, లేక పాత మిత్రుడైన కేసీఆర్ కావాలన్నది జగన్ తేల్చుకోవాల్సి వస్తుంది. అప్పుడు జగన్ ఎలా స్పందిస్తారన్నది ఆయనపై ఉన్న కేసులే నిర్ణయిస్తాయన్న చర్చ కూడా జరుగుతోంది.












Click it and Unblock the Notifications